రాఫెల్ పై పార్లమెంటును సమావేశ పరచాలి:కేజ్రీవాల్.

న్యూఢిల్లీ:

రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంపై అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటనతో బీజేపీ అన్నివైపుల నుంచి చిక్కుల్లో పడింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అధికార పార్టీకి ఊపిరి సలపనివ్వకుండా దాడులు చేస్తూనే ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సైతం ఈ వ్యవహారంపై కమలదళంపై కాలు దువ్వుతోంది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శర పరంపరగా ట్వీట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రధానమంత్రి తన మూడు ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాఫెల్ కాంట్రాక్ట్ ను అనిల్ అంబానీకే ఎందుకు కట్టబెట్టారు? ఇతరులెవరికీ ఎందుకు ఇవ్వలేదు? మీతో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని అనిల్ అంబానీ చెప్పారు. మీకు ఆయనతో ఏవైనా వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయా? రాఫెల్ కుంభకోణంలో డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లింది? మీకా, బీజేపీకా లేదా ఇంకెవరికైనానా? ఇవే కాకుండా రాఫెల్ వివాదంపై చర్చించేందుకు వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.