మొబైల్ ఫోన్లని వెటకారం చేసిన ఆశా భోస్లే

మొబైల్ ఫోన్లని వెటకారం చేసిన ఆశా భోస్లే
Asha Bhsole Tweet Pic

మనలో చాలా మందికి సెల్ ఫోన్ లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం కూడా అసాధ్యం. ఏదైనా కోల్పోతామేమోనన్న భయం వెంటాడుతూనే ఉంటుంది. ఇటీవల ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే షేర్ చేసిన ఓ ఫోటో చూస్తే మనందరం ఓ సారి వీపుపై చరిచినట్టు ఫీలవడం ఖాయం. ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెడుతూ 85 ఏళ్ల సీనియర్ గాయని ‘బాగ్ డోగ్రా నుంచి కోల్ కతా..ఎంతో మంచి కంపెనీ కానీ, మాట్లాడేందుకు ఎవరూ లేరు. థాంక్యూ అలెగ్జాండర్ గ్రాహం బెల్’ అని రాసింది. ఆ పోస్ట్ తో పాటు ఓ ఫోటోగ్రాఫ్ కూడా ఉంది. ఓ వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నట్టుగా ఉన్న ఈ ఫోటోలో ఇతరులతో పాటు గాయకులు సుదేష్ భోస్లే, సిద్ధాంత్ భోస్లే కూడా ఉన్నారు.

ఆశా తన ట్వీట్ లో అక్కడ కూర్చున్న వాళ్లందరినే కాదు ఎదురుగా ఉన్నవాళ్లతో మాట్లాడకుండా ఎక్కువ సమయం తమ మొబైల్ ఫోన్లలో ముచ్చట్లతో గడిపేవారందరికీ ఓ హెచ్చరికే. అక్కడ ఉన్నవాళ్లందరిలో ఆశా భోస్లే ఒక్కరి చేతుల్లోనే ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణం లేదు. ఈ ట్వీట్ చూసిన చాలా మంది తాము కూడా కొన్నిసార్లు అచ్చంగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నామని చెప్పి వాపోయారు. మరికొందరు మాత్రం లెజెండరీ సింగర్ సాన్నిధ్యంలో చిరకాలం నిలిచిపోయే క్షణాల కోసం తాము తమ ఫోన్ల వైపు కన్నెత్తయినా చూడమని చెప్పారు.