‘ఆయుష్మాన్ భారత్’ రేపే ప్రారంభం.

న్యూఢిల్లీ:

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘ఆయుష్ భారత్-ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన’ (ఆయుష్మాన్ భారత్)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ప్రారంభించనున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ప్రభాత్ తార మైదానంలో ప్రధాని ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఏటా దేశవ్యాప్తంగా ఉన్న 10 కోట్లకు పైగా కుటుంబాలకు ఆరోగ్య బీమా అందజేయనున్నారు.రేపు ఉదయం ప్రధానమంత్రి రాంచీ చేరుకొని అక్కడ పీఎంజేఏవై ప్రదర్శనను తిలకిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఆ తర్వాత ఆయన లబ్ధిదారుల గుర్తింపు, ఈకార్డు తయారీ వంటి పనులను పరిశీలిస్తారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించినప్పటికీ జనసంఘ్ సహవ్యవస్థాపకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి అయిన సెప్టెంబర్ 25 నుంచి అమలులోకి వస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 445 జిల్లాలలో అమలవుతుంది. దేశవ్యాప్తంగా 15,000కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లు ఈ పథకంలో చేరేందుకు తమ ఆసక్తి వ్యక్తం చేశాయి. దీంతో చికిత్స కోసం సుమారుగా 2.65 లక్షల పడకలు అందుబాటులోకి రానున్నాయి. 10.74 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఆరోగ్య బీమా అందజేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.