బొమ్మ తుపాకీతో బ్యాంకు చోరీ యత్నం!!

హైదరాబాద్:

హైదరాబాద్ మణికొండలో పట్టపగలు అందరూ చూస్తుండగా బ్యాంకు చోరీ యత్నం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం రాయదుర్గం హుడా కాలనీలోని కరూర్ వైశ్యా బ్యాంక్ బ్రాంచ్ లో డేవిడ్ ప్రవీణ్ అనే ఓ దుండగుడు కస్టమర్ మాదిరిగా లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత అందరూ చూస్తుండగా తన దగ్గరున్న బొమ్మ తుపాకీతో బ్యాంకు సిబ్బందిని బెదిరించాడు. డబ్బు, బంగారం అంతా మూటగట్టి ఇవ్వాలని ఆగంతకుడు డిమాండ్ చేశాడు. బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లంతా ప్రాణభయంతో వణికిపోయారు. కాసేపటికి తేరుకున్న సిబ్బంది, ఖాతాదారులు, స్థానికులు అప్రమత్తమయ్యారు. ప్రవీణ్ పై తిరగబడ్డారు. గన్ పేల్చుతానని దొంగ బెదిరిస్తున్నాడు తప్ప ఎంతకీ రివాల్వర్ నుంచి బుల్లెట్ రాకపోవడంతో అంతా చుట్టుముట్టి ప్రవీణ్ ని పట్టుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించి డేవిడ్ ప్రవీణ్ ని వారికి అప్పజెప్పారు. అలా బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీ యత్నం విఫలమైంది. దోపిడీకి వచ్చిన దొంగ కరూర్ వైశ్యా బ్యాంక్ ఖాతాదారుడేనని బ్యాంకు సిబ్బంది గుర్తించారు.