ప్రియాంక రంగ ప్రవేశం. బీజేపీలో కలకలం.

ప్రియాంక రంగ ప్రవేశం. బీజేపీలో కలకలం.

ఎస్.కే. జకీర్:

ప్రియాంక గాంధీ రాజకీయ రంగ ప్రవేశం బీజేపీలో పెద్ద కలకలమే సృష్టించినట్టు కనిపిస్తోంది. కమలదళం విమర్శలతో కాంగ్రెస్ పై విరుచుకు పడుతోంది. ప్రియాంక నియామకంతో కాంగ్రెస్ ఓ కుటుంబానికి చెందిన పార్టీ అని రుజువైందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు. ప్రియాంక గాంధీ నియామకంతో రాహుల్ గాంధీ విఫలమయ్యారని కాంగ్రెస్ అంగీకరించినట్టయిందన్నారు. మహాకూటమిలో కాంగ్రెస్ ను చేర్చుకొనేందుకు నిరాకరించడంతో కాంగ్రెస్ ఇంట్లోనే ఒక ఊతకర్ర అవసరమైందని.. ప్రియాంక ఆ ఊతకర్రగా మారారని ఎద్దేవా చేశారు. నెహ్రూ తర్వాత ఇందిర, ఆ తర్వాత రాజీవ్, అటు పిమ్మట సోనియా, ఆపైన రాహుల్, ఇప్పుడు ప్రియాంక..వీళ్లే ఎందుకు ఉండాలని న్యూ ఇండియా ప్రశ్నిస్తోందన్నారు. బీజేపీలో పార్టీయే కుటుంబం అయితే కాంగ్రెస్ లో కుటుంబమే పార్టీ కావడం రెండు పార్టీల మధ్య ఉన్న భేదమని వివరించారు. ‘ప్రియాంక గాంధీ అధికారికంగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియుక్తలయ్యారు. కానీ ఈ కుటుంబ సంస్థ ఎలా పని చేస్తుందో అందరికీ తెలుసు. రాహుల్ విఫలమయ్యారని కాంగ్రెస్ మొదటిసారి అధికారికంగా ప్రకటించినట్టయింది. ఇప్పుడు వాళ్లు కుటుంబ తరహా ఆలోచన విధానం ఎలా ఉంటుందో వివరించాలని’ కేంద్ర మంత్రి, బీజేపీ యుపి ఇన్ ఛార్జి జెపి నడ్డా అన్నారు. మరో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తన ట్వీట్ లో కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. యుపీ ఈస్ట్ కి ప్రియాంక వాద్రాను జనరల్ సెక్రటరీగా నియమించడం ఈ ఏడాదిలో అన్నిటికన్నా అప్రాధాన్య వార్త అని కొట్టిపారేశారు. కొందరికి ఇది చాలా పెద్ద వార్త కావచ్చని తేల్చేశారు. ప్రతి ఎన్నికల ముందు ప్రియాంక కార్డ్ బయటికొస్తుందని ప్రతిసారీ విఫలం అవుతుందని గుర్తు చేశారు. కుటుంబ రాజకీయాల ప్రమాదం పొంచి ఉందని జీవీఎల్ ట్వీట్ చేశారు.