బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ ఫెయిలైంది!!

బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ ఫెయిలైంది!!

రాజ్ చెరుకూరి:

కర్ణాటకలో అధికార సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న బీజేపీ ప్రయత్నం విఫలమైందని కాంగ్రెస్ నేత జి పరమేశ్వర అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేందుకు చేపట్టిన ఆపరేషన్ లోటస్ అట్టర్ ఫ్లాపైందన్నారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మాతోనే ఉన్నారు. పార్టీలో అంతా సవ్యంగానే ఉంది. కొందరు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో లేరు. కానీ వాళ్లు త్వరలోనే బెంగుళూరుకి వస్తారు’ అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తెలిపారు. కాంగ్రెస్ సభ్యులను కొనేందుకు బీజేపీ చేసిన ‘ఆపరేషన్ లోటస్’ ముగిసిందని ఆయన స్పష్టం చేశారు.” ‘ఆపరేషన్ కమల’ నాటకం ముగిసింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేసే ప్రయత్నాలేవీ పనిచేయలేదు. మాకు అందరు ఎమ్మెల్యేల మద్దతు ఉందని” కాంగ్రెస్ నేత అన్నారు. సిద్దరామయ్య నాయకత్వంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ జనవరి 18న బెంగుళూరులో సమావేశం కానున్నట్టు పరమేశ్వర ప్రకటించారు. ఈ సమావేశంలో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ ను చర్చిస్తామని తెలిపారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సజావుగా పని చేస్తోందని ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి కూడా చెప్పారు. ‘మా సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగుతోంది. నాకెలాంటి ఆందోళన లేదు. మా ఎమ్మెల్యేలందరూ మాకు అందుబాటులోనే ఉన్నారు. వాళ్ల మద్దతు మాకుందని’ అన్నారు.కర్ణాటక అధికార సంకీర్ణ భాగస్వాములైన జేడీఎస్-కాంగ్రెస్, బీజేపీ కొద్దిరోజులుగా ఒకరి ఎమ్మెల్యేలను మరొకరు ఫిరాయింప జేసేందుకు ప్రయత్నిస్తున్నారని పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.