ఫేస్‌బుక్‌కు బ్రిటన్‌ భారీ జరిమానా!!

న్యూఢిల్లీ:
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌ను కేంబ్రిడ్జి అనలిటికా పాపం వదలడం లేదు. కేంబ్రిడ్జ్‌ అనలిటికా సమాచార చోరీ కేసులో ఇంటర్నెట్‌ దిగ్గజ సంస్థ ఫేస్‌బుక్‌కు బ్రిటన్‌ సమాచార కమిషనర్‌ కార్యాలయం (ఐడో) చట్టంలోని గరిష్ఠ పరిమితి మేరకు 5,00,000 పౌండ్ల (6.44 లక్షల డాలర్లు) జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేసింది. వినియోగదారుల అంగీకారం లేకుండా ఫేస్‌బుక్‌ 2007 నుంచి 2014 వరకు వారి వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా, ఇతర యాప్‌ డెవలపర్లకు అందించిందని బ్రిటన్‌ సమాచార కమిషనర్‌ దర్యాప్తులో తేలింది. దీంతో చట్టప్రకారం గరిష్ఠంగా ఫేస్‌బుక్‌పై 5,00,000 పౌండ్ల జరిమానా విధించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు ఫేస్‌బుక్‌ సంస్థ తన వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వారి సమ్మతి లేకుండా అందజేసిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇదే కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణంగా ప్రాచుర్యం పొందింది. ఈ కుంభకోణం బయటపడగానే ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేగింది. 2016 అమెరికా ఎన్నికల్లో కేంబ్రిడ్జి అనలిటికా డొనాల్డ్‌ ట్రంప్‌ కోసం పనిచేసిందని వార్తలు వచ్చాయి. భారత్‌లో నరేంద్రమోడీ, రాహుల్ ‌గాంధీ కేంబ్రిడ్జి అనలిటికాను ఉపయోగించుకొన్నారని పరస్పరం ఆరోపించుకున్నారు. తమ వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టినందుకు ఫేస్‌బుక్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది ఫేస్‌బుక్‌ వీడిపోయారు.ఫేస్‌బుక్‌ తన యూజర్ల సమాచారాన్ని కాపాడటంలో విఫలమైందని బ్రిటన్‌ సమాచార కమిషనర్‌ ఎలిజెబెత్‌ డెన్హామ్‌ వ్యాఖ్యానించారు. సమాచార భద్రతపై పూర్తి అవగాహన, సమగ్ర నిపుణత కలిగిన సంస్థ.. వినియోగదారుల సమాచార భద్రతకు మెరుగైన చర్యలు తీసుకుని వుండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో‌ ‘యూరోపియన్ యూనియన్’ రూపొందించిన కొత్త సమాచార భద్రతా నిబంధనలు అమలవుతూ ఉంటే జరిమానా మొత్తం ఇంకా పెరిగేది. సమాచార కమిషనర్‌ నిర్ణయాన్ని సమీక్షిస్తున్నట్టు ఫేస్‌బుక్‌ తెలిపింది.