కొండగట్టు దగ్గర బస్సు బోల్తా. 20 మంది మృతి.

జగిత్యాల:
కొండగట్టు ఘాట్ రోడ్డులో బోల్తా పడిన ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడం పట్ల, పలువురు తీవ్రంగా గాయపడడం పట్ల ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి వెంటనే సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.కొండగట్టు బస్సు ప్రమాదం పట్ల నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మెరుగైన సహాయక చర్యలను అందించాలని జిల్లా కలెక్టర్ , ఎస్పి లను కోరారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను హైదరాబాద్ కు తరలించాలని కవిత సూచించారు. కొండగట్టు ఘాట్‌ దగ్గర ఘోర ప్రమాదంపై రవాణా మంత్రి మహేందర్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడిన వారికి మంచి వైద్యం చేయించాలని ఆర్టీసీ అధికారులను
మంత్రి ఆదేశించారు.ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే మంత్రి ఈటెల హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులకు జగిత్యాల, కరీంనగర్ ఆస్పత్రులలో చికిత్సనందిస్తూ ఉన్నారు.