500 అడుగుల లోయలో పడ్డ బస్సు, 28 మంది మృతి

500 అడుగుల లోయలో పడ్డ బస్సు, 28 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ జిల్లాలో పెద్ద ప్రమాదం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు బంజార్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలోని భియోఠ్ మలుపు దగ్గర ఒక ప్రైవేట్ బస్సు 500 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 28 మంది మరణించారు. 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

కుల్లూ నుంచి గాడాగుషైణీ వైపు వెళ్తున్న బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంది. లోయలో పడగానే బస్సు తుత్తునియలైంది. బస్సు పై భాగం పూర్తిగా ధ్వంసమైంది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. తమవారి మృతదేహాలు చూసి వారి బంధువుల చేస్తున్న రోదనలతో ఘటనాస్థలం మార్మోగుతోంది. ప్రమాదం జరిగినపుడు బస్సులో సుమారు 60 మంది ఉన్నారు.

ఎందరికో తీవ్రంగా గాయాలయ్యాయి. లోయ నుంచి గాయపడినవారి నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు, స్థానికులు ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. స్థానికుల సహాయసహకారాలతో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ప్రస్తుతం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. గాయపడిన 12 మంది మహిళలు, ఆరుగురు బాలికలు, ఏడుగురు పిల్లలు, 8 మంది యువకులను రక్షించారు. వీరంతా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. చికిత్స కోసం వీరిని బంజార్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బస్సు ఎక్కినవారిలో చాలా మంది బంజార్ స్కూల్, కాలేజీ విద్యార్థులుగా చెబుతున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.