“డీడీ కెమెరామెన్‌ను కావాలని చంపలేదు”.

మావోయిస్టులు:

దంతేవాడ:

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో జరిగిన దాడిపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మీడియా కానీ, డీడీ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహు కానీ తమ టార్గెట్ కాదని పేర్కొంది. గత మంగళవారం దంతేవాడలో జరిగిన నక్సల్స్ దాడిలో సాహు, ఇద్దరు పోలీసులు మరణించగా, మరో ఇరువురు గాయపడ్డారు. దీనిపై సీపీఐ (మావోయిస్టు) దార్బా డివిజన్ కమిటీ చీఫ్ సాయినాథ్ పేరుతో రెండు పేజీల ప్రకటన విడుదలైంది.
‘ప్రతిరోజూ మా గ్రామాలపై దాడులు జరుగుతున్నాయి. స్థానికులను కొట్టడం, నకిలీ ఎన్‌కౌంటర్లలో కాల్చిచంపడం, తప్పుడు కేసుల్లో జైలుకు పంపడం జరుగుతోంది. కొందర్ని నక్సల్స్‌ ముద్ర వేస్తూ లొంగిపోయినట్టు ప్రకటిస్తున్నారు. ఇదంతా సాధారణ ప్రక్రియగా మారిపోయింది. రాజకీయ పార్టీలు మీడియాను తప్పుదారి పట్టిస్తున్నాయి’ అని ఆ లేఖ పేర్కొంది. ప్రతిరోజులాగే అక్టోబర్ 30న కూడా తమపై పోలీసులు దాడికి దిగారని, తాము ప్రతిదాడికి దిగినప్పుడు ‘దూరదర్శన్ బృందం’ కూడా వారితో ఉన్నట్టు తమకు తెలియదని, అనివార్యంగా జరిపిన కాల్పులే సాహూ మృతికి దారితీసిందని వివరించింది. జర్నలిస్టులు పోలీసులకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా ఎన్నికల డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందితో కలిసి ఉండొద్దని కూడా ఆ లేఖ సూచించింది.కాగా, డీడీ కెమెరామెన్‌ను ఉద్దేశపూర్వకంగా చంపలేదంటూ నక్సల్స్ పేర్కొనడాన్ని దంతేవాడ ఎస్‌పీ అభిషేక్ పల్లవ్ తోసిపుచ్చారు. ‘అదే నిజమైతే కెమెరా ఎందుకు ఎత్తుకెళ్లారు? రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండబట్టే అలా జరగింది. పొరపాటు జరిగిందనడానికి ఆస్కారమే లేదు’ అని అన్నారు.