‘గాలి’లేని నల్లగొండలో హోరాహోరీ!! భువనగిరి, నకిరేకల్, సూర్యాపేటలలో ‘కారు’. మిగతా చోట్ల భీకర పోరు!!


ఎన్. రవి,నల్లగొండ:

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏ పార్టీకి ‘గాలి’ లేదు.12 నియోజకవర్గాల్లోనూ హోరాహోరీ పోరాటం జరుగుతున్నది.సమస్యల పరిష్కారం, అబివృద్ది కన్నా పార్టీ, కులం, డబ్బు, నేతల పట్ల విధేయత వంటి అంశాల ప్రాతిపధికపై ఎన్నికలు జరుగుతున్నవి.కాంగ్రెస్ అంటే నల్లగొండ,నల్లగొండ అంటే కాంగ్రెస్ అనే ప్రచారం చాలా కాలంగా నమోదు అయి ఉన్నది. ఈ ఎన్నికల అనంతరం ఆ మాట వినపడొద్దన్నది టీఆర్ఎస్ పట్టుదల. ఇటు కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ పార్టీని ఉమ్మడి జిల్లాలో నామరూపం లేకుండా తుడిచి పెట్టాలని పథకం రచిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఈ జిల్లా నాయకుడే సీఎం అవుతారన్న ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ జనంలోకి బలంగా తీసుకుపోతున్నది.నల్లగొండ జిల్లాలో రాజకీయ పవనాలు ఎటువైపు వీస్తున్నాయి..? కాంగ్రెస్, టీఆర్ఎస్ తమ పాత స్థానాలను తిరిగి నిలబెట్టుకుంటాయా..? మరిన్ని పెరుగుతాయా..లేక తగ్గుతాయా..? ‘మహాకూటమి’లో భాగస్వాములకు జిల్లాలో కేటాయించే స్థానాలేవి..? పొత్తులు సరే..మరి ఓట్ల బదిలీ సక్రమంగా జరుగుతుందా..? ఆయా పార్టీల్లో టిక్కెట్ ఆశించి బంగపడ్డవారితో ఎలాంటి పరిణామాలు తలెత్తనున్నాయి..? వంటి ప్రశ్నలు ఉన్నవి. నల్లగొండ జిల్లా నేతలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ అది కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన జిల్లాల పునర్విభజనలో మూడు జిల్లాలుగా మారింది. నల్లగొండతో పాటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. రెండు పార్లమెంట్ స్థానాలున్నాయి. ఇందులో తొమ్మిది జనరల్ స్థానాలు ఉన్నాయి. మరో రెండు ఎస్సి రిజర్వుడ్ కాగా, ఒకటి ఎస్టీ రిజర్వుడ్ స్థానం ఉంది.

నియోజకవర్గాలు:

నల్లగొండ..(జనరల్),మునుగోడ (జనరల్),మిర్యాలగూడ(జనరల్),నాగార్జునసాగర్..(జనరల్),హుజుర్ నగర్(జనరల్),కోదాడ..(జనరల్), సూర్యాపేట(జనరల్),ఆలేరు (జనరల్),భువనగిరి..(జనరల్),నకేరేకల్.(ఎస్సి),తుంగతుర్తి(ఎస్సి),దేవరకొండ(ఎస్టీ).

జిల్లాలో మొత్తం ఓటర్లు..26,21,080.

మొదటి నుంచి రాజకీయంగా బలమైన పార్టీలు కమ్యూనిస్టులు. ఆ తరువాత కాంగ్రెస్, టీడీపీ. భీంరెడ్డి నర్సింహారెడ్డి మొదలుకొని నందమూరి తారకరామారావు, ఎలిమినేటి మాధవరెడ్డి, పాల్వాయి, ఉప్పునూతల లాంటి ఎందరో రాజకీయ ఉద్దండులు ఇక్కడి నుంచి గెలిచినవారే. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో కుందూరు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటి అగ్రనేతలు ఉన్నారు 2014 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ కి ధీటుగా టీఆర్ఎస్ కూడా ఆరు స్థానాలను గెలుచుకుంది. మరో ఆరు స్థానాల్లో ఐదు స్థానాలు కాంగ్రెస్, కాంగ్రెస్ తో పొత్తుతో సీపీఐ ఒక స్థానాన్ని గెలుచుకుంది. అయితే తరువాత మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు(కాంగ్రెస్), దేవరకొండ ఎమ్మెల్యే (సీపీఐ) గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది. విచిత్రం ఏమిటంటే వీరందరూ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారే. మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వీరందరికి మళ్ళీ టిక్కెట్లు దక్కాయి. కాంగ్రెస్ అగ్రనేతలంతా మళ్ళీ బరిలోకి దిగుతున్నారు. ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి ఈ సారి మునుగోడు నుంచి ఎమ్మెల్యే అబ్యర్దిగా రంగంలోకి దిగుతున్నారు. సూర్యపేట నుంచి సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి తాజా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పై మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరో సీనియర్ నాయకుడు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి మిర్యాలగూడ నుంచి ఎమ్మెల్యే అబ్యర్దిగా బరిలోకి దిగడానికి ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాలు మొత్తం ఒక ఎత్తు కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలు మరో
ఎత్తు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా ఉండటం, అంతా ముఖ్యమంత్రి రేసులో ఉన్నామని చెప్పుకుంటుండటంతో ఈ ప్రధాన్యత సంతరించుకున్నది. టీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో జిల్లా పై ఫోకస్ పెట్టింది. ఇప్పటిదాకా ఉన్న ఎనిమిది స్థానాలను గెలుపొందడమే కాకుండా మరో రెండు, మూడు స్థానాల్లో గట్టిగా పోరాడాలని భావిస్తున్నది. నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికి నాలుగుసార్లు వరుసగా గెలిచారు.ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయనకు బలమైన ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి రంగంలోకి దిగారు. టీడీపీ లో పనిచేసి టీఆర్ఎస్ లో చేరిన భూపాల్ కి ప్రస్తుతం ‘ఇంటి పొరు’ పూర్తిగా తొలగిపోలేదు.పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ దుబ్బాక నర్సింహ రెడ్డి, తండు సైదులు గౌడ్ ఆయనకు ఏ మేరకు సహకరిస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ చకిలం అనిల్ బీజేపీ అబ్యర్దిగా బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. కోమటిరెడ్డి ఇప్పటికే ‘ఆపరేషన్ ఆకర్ష్’ మొదలుపెట్టారు. ఒకప్పుడు తన దగ్గర ఉండి అనంతరం టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారందరిని తిరిగి పార్టీలోకి తీసుకొస్తున్నారు. టీడీపీ, సీపీఐ తో పొత్తు ఉండటం కూడా వెంకట్ రెడ్డికి క కలిసొచ్చే అంశం. బి ఎల్ ఎఫ్ అబ్యర్దిగా మినయ్య ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు.
నాగార్జునసాగర్ లో ‘సీఎం’ అభ్యర్థి?,
కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఎనిమిదో సారి రంగంలోకి దిగుతున్నారు. బలమైన ఈ నేతను ఢీకొట్టేందుకు టీఆర్ఎస్ అబ్యర్ది నోముల నర్సింహయ్యను రంగంలోకి దిగారు.జానారెడ్డిని ఢీ కొట్టడం ఆషా మాషీ వ్యవహారం కాకపోయినప్పటికి టీఆర్ఎస్ ఈ సారి గట్టిగా పోరాడేందుకు ప్రయత్నిస్తుంది. నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తులందరిని కేటీఆర్ బుజ్జగించారు.” వచ్చేది మా ప్రభుత్వమే, మా నేతే ముఖ్యమంత్రి” అని జానారెడ్డి అనుచరులు చేస్తున్న చేస్తున్న ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఊపు కనిపిస్తుంది.మునుగొడులో టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
అసమ్మతి ఊబిలో చిక్కుకున్నారు. అసమ్మతి ఆయన కొంప ముంచవచ్చు. పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ వేనేపల్లి వెంకటేశ్వరరావును పార్టీ సస్పెండ్ కూడా చేసింది. నియోజకవర్గంలో గట్టి పట్టున్న వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగవచ్చు. లేదా అవతలి పార్టీ అబ్యర్డులతో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొ
ట్టవచ్చు. మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ ఈ స్థానాన్ని కోరుతుంది. ఇక్కడ సీపీఐ
కి గతంలో బలమైన పునాదులే ఉన్నాయి.ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదా అన్న అంశంపై స్పష్టత లేదు. తనకు టిక్కెట్ ఇస్తే బంపర్ మెజార్టీతో గెలుస్తానని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఆ నేపథ్యంలో పార్టీ టిక్కెట్ ఆయనకే దక్కే అవకాశాలు కనపడుతున్నాయి. రాజగోపాల్ కె టిక్కెట్ ఖాయమైనట్లు పీసీసీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవి టీఆరెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు.ఆయన రాజకీయ నిర్ణయం ఇంకా వెల్లడి కావలసి ఉన్నది. ఎస్టీ రిజర్వుడ్ స్థానమైన దేవరకొండలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని సీపీఐ గెలిచింది. కానీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో టిక్కెట్ మళ్ళీ ఆయనకే దక్కింది. అయితే అప్పటికే టీఆర్ఎస్ లో పని చేస్తున్న నేతలతో పాటు, మధ్యలో కాంగ్రెస్ నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్న జడ్పి చైర్మన్ బాలునాయక్ కూడా టిక్కెట్ ఆశించారు. అయితే అధిష్టానం రవీంద్రకుమార్ వైపు మొగ్గుచూపడంతో బాలునాయక్ పార్టీని వీడి తన సొంతగూటికి వెళ్ళాడు. బాలునాయక్ ఇప్పుడు కాంగ్రెస్ లో టిక్కెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ లో మరో ఇద్దరు ముగ్గురు కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. సీపీఐ కి బలమైన పునాదులే ఉండటంతో ఆ పార్టీ నేతలు కూడా టిక్కెట్ తమకే కేటాయించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ అందుకు ఒప్పుకోవడం లేదని సమాచారం. టిక్కెట్ ఎవ్వరికి కేటాయించినప్పటికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పొత్తు వల్ల ఆ కూటమి బలం బాగా పెరుగుతుంది. పోటీ కూటమి అబ్యర్ది, టీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది. మిర్యాలగూడలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి నల్లమోతు భాస్కర్ రావు గెలిచారు. ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్లారు. ముందు హామీ ఇచ్చినట్లుగానే టీఆర్ఎస్ ఈ సారి టిక్కెట్ ఆయనకే ఇచ్చింది. అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అబ్యర్దిగా బరిలోకి దిగి భారీగా ఓట్లు సంపాదించిన అమరేందర్ రెడ్డి టిక్కెట్ ఆశించి బంగపడ్డాడు. పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండటంతో వచ్చే ఎన్నికల్లో రెబల్ అబ్యర్దిగా బరిలోకి దిగుతారని అంతా భావించారు. కానీ ఆయన ఉన్నట్టుండి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రఘువీర్ రంగంలోకి దిగితే పార్టీలో కొత్త ఊపు వస్తుందని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. తన కుమారుడి గెలుపు కోసం జానారెడ్డి అన్ని రకాలుగా చక్రం తిప్పుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి లాంటి పెద్ద నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కాంగ్రెస్ కు బలాన్ని ఇచ్చింది. సీపీఎం తరపున మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరపున బరిలోకి దిగనున్నారు. ఆ పార్టీకి ఇక్కడ గట్టి పట్టే ఉంది. టిజేఎస్ కూడా మిర్యాలగూడ స్థానంపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఇక్కడ కాంగ్రెస్, సీపీఎం, టీఆర్ఎస్ మధ్యనే హోరాహోరీగా పోరు కొనసాగే అవకాశం ఉంది. హుజూర్ నగర్ లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ఐదోసారి తన సత్తాను చాటేందుకు కసరత్తు చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి అధిష్టానం ఆమెకు టిక్కెట్ ఇవ్వడానికి సుముఖంగా లేదు. దాంతో ఎన్నారై సైదిరెడ్డి పేరును పార్టీ పరిశీలనలో ఉంది. పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో అబ్యర్ధిని ప్రకటించలేదు. మరో ఎన్నారై అప్పిరెడ్డి
కూడా టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ టిక్కెట్ కోసం పెద్ద పోరాటమే నడుస్తుంది. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది. కోదాడలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అబ్యర్దిగా పద్మావతి గెలుపొందారు. ఈ సారి కూడా పార్టీ తరపున ఆమెనే పోటీచేసేందుకు సిద్దమయ్యారు. అయితే టీడీపీకి బలమైన పునాదులు ఉన్నాయి. దానికి తోడు ఆపార్టీ నేత బొల్లం మల్లయ్య యాదవ్ కి జనంలో మంచి పేరుంది. దాంతో ఆయన పొత్తులో భాగంగా ఈ టిక్కెట్ తనకు కేటాయించాలని ఆయన అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారు. అయితే సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్ ఆ ప్రతిపాదనకు అంగీకరించడంలేదు. కావాలంటే మల్లయ్య యాదవ్ కి పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఒకవిధంగా న్యాయం చేస్తామని హామీ ఇస్తోంది. మరోవైపు పద్మావతి ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుంది. టిక్కెట్ దక్కకపోతే మల్లయ్య యాదవ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది సస్పెన్స్. ఇదిలా ఉంటె ఇటు టీఆర్ఎస్ ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన శశిధర్ రెడ్డి మరోసారి టిక్కెట్ ఆశిస్తున్నారు. మరోవైపు సీనియర్ నేత చందర్ రావు కూడా టిక్కెట్ కోసం తన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికైతే చందర్ రావుకే టిక్కెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ చందర్ రావుకి టిక్కెట్ దక్కితే శశిధర్ రెడ్డి ఆయనకు ఏ మేరకు సహకరిస్తాడనేది అనుమానంగా ఉంది. సూర్యాపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో గుంటకండ్ల జగదీశ్ రెడ్డి విజయం సాధించారు. తొలిసారిగా ఎన్నికై కూడా ఆయన మంత్రి పదవి సంపాదించారు. ఇప్పటికే ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు కూడా. కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పోటీ చేశారు. టీడీపీ నుంచి పటేల్ రమేష్ రెడ్డి, ఇండిపెండెంట్ గా సంకినేని వెంకటేశ్వరరావు పోటీచేశారు. జగదీశ్ రెడ్డికి, సంకినేనికి, దామోదర్ రెడ్డికి మధ్య కేవలం రెండు వేల ఓట్ల తేడానే ఉంది. పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరాడు. ఇప్పుడు కాంగ్రెస్ టిక్కెట్ తనకే కేటాయించాలని రమేష్ రెడ్డి రేవంత్ ద్వారా అధిష్ఠానం పై వత్తిడి తీసుకొస్తున్నాడు. బీజేపీ నుంచి ఇక్కడ సంకినేని వెంకటేశ్వరరావు బరిలోకి దిగుతున్నారు. సంకినేని కి కూడా ఇక్కడ మంచి పేరే ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ
ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి పొత్తు ఉండటం అదనపు బలం. దీనికి తోడు పటేల్ రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి ఐక్యంగా పనిచేస్తే మాత్రం కాంగ్రెస్ గెలుపు సునాయాసమే. నకేరేకల్ లో గత ఎన్నికల్లో వేముల విరేశం గెలుపొందారు. ఈ సారి కూడా పార్టీ టిక్కెట్ ఆయనకే దక్కింది. వీరేశంకు కూడా ఇంటి పోరు ఏమీలేదు. ఇక ఆయన కూడా ప్రచారం ఎప్పుడో మొదలుపెట్టారు. వీరేశం కు
ప్రజాదరణ ఉన్నది.కాంగ్రెస్ నుంచి రేసులో ఉన్నవారిలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేరు వినపడుతోంది. లింగయ్యకు కోమటిరెడ్డి బ్రదర్స్ అందండలు పుష్కలంగా ఉన్నాయి. బ్రదర్స్ సొంత గ్రామం బ్రాహ్మణవెళ్లెముల ఇదే నియోజకవర్గం పరిధిలో ఉండటం, చిరుమర్తి లింగయ్యది కూడా అదే గ్రామం కావడంతో కోమటిరెడ్డి సోదరులు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఇకపోతే మహకూటమి లో తాను కూడా బాగస్వామినవుతానని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఓ ప్రతిపాదన పెట్టాడు. అయితే తన భార్య లక్ష్మికి కూటమి తరపున నకేరేకల్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ కేటాయించాలని ఇటు కాంగ్రెస్, అటు కోదండరామ్ కి విజ్ఞప్తి చేశారు. దీనికి కాంగ్రెస్ సుముఖంగా లేనట్లు తెలుస్తుంది. టిక్కెట్ కాంగ్రెస్ కే ఇవ్వాలని, అదికూడా అభ్యర్థి చిరుమర్తి లింగయ్యనే పెట్టాలని ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. మరో ఎస్సి నియోజకవర్గమైన తుంగతుర్తి లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గాదరి కిషోర్ గెలుపొందారు. ఈ సారి కూడా ఆయనే పార్టీ అబ్యర్దిగా ఉన్నారు. కిషోర్ కి ఇంటి పోరు బాగానే కనపడుతుంది. ఇక్కడి నుంచి పార్టీ టిక్కెట్ ఆశించిన వారిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామెల్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్ ఉన్నారు. వీరికి టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. అంతకంటే ఎక్కువగా కిషోర్ వైఖరి వారికి ఏ మాత్రం మింగుడు పడటంలేదు. దాంతో వారు ఎన్నికల్లో ఆయన గెలుపుకు ఏ మేరకు సహకరిస్తారనే అనుమానాలు పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో కూడా కిషోర్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ నుంచి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయాకర్ టిక్కెట్ ఖరారు అయ్యింది. దయాకర్ కి కోమటిరెడ్డి సోదరుల అండ దండలున్నవి. దయాకర్ గెలుపు నల్లేరు మీద నడకేనని చెప్పొచ్చు. ఇక్కడ టీడీపీ కి కూడా గట్టి బలమే ఉంది. అది కూడా కాంగ్రెస్ కి ఆదనపు బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. జనరల్ స్థానమైన ఆలేరులో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గొంగిడి సునీత గెలుపొందారు. ఈ సారి కూడా పార్టీ టిక్కెట్ ఆమెకే దక్కింది. ఇక ఇక్కడ పార్టీలో
‘అసమ్మతి కుంపటి’ అంతా ఇంతా కాదు. మొదటి నుంచి సునీత వైఖరి ద్వితీయ, తృతీయ శ్రేణి క్యాడర్ కి ఏ మాత్రం మింగుడు పడకుండా అయ్యింది. ముఖ్యంగా సునీత భర్త మహేందర్ రెడ్డి ఒంటెద్దు పోకడలు వారికి నచ్చడంలేదు. ఈ నేపథ్యంలో వారంతా సునీత గెలుపుకు ఏ మేరకు కృషి చేస్తారనేది ప్రశ్నర్థకం. కాంగ్రెస్ అబ్యర్దిగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్య గౌడ్ బరిలోకి దిగబోతున్నారు. మరోవైపు టీడీపీకి బలమైన పునాదులే ఉన్నాయి. పార్టని వదిలిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రభావం చాలా తక్కువ. బీజేపీ కూడా తమ అబ్యర్ధిని బరిలోకి దింపుతుంది. ఇండిపెండెంట్ గా సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు బి ఎల్ ఎఫ్ కూడా మద్దతు ప్రకటించింది. ఆయన రంగంలోకి దిగితే ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుంది. పోరు మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది. భువనగిరిలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అబ్యర్దిగ ఫైళ్ల శేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా టిక్కెట్ ఆయనకే దక్కింది. చింతల వెంకటేశ్వర రెడ్డి లాంటి వాళ్లు ఇప్పటికీ ఆయన తరపున ప్రచారంలో పాల్గొనడంలేదు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థుల్లో శేఖర్ రెడ్డికే సానుకూల పవనాలు విస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ తరపున కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోటీ చేయవచ్చు. జిట్టా బాలకృష్ణారెడ్డి తన సొంత పార్టీ “యువ తెలంగాణ” తరపున మహాకూటమి అబ్యర్దిగా నైనా అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు.