ట్రంప్ అవినీతిపై కేసులు!

వాషింగ్టన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి పెద్ద షాక్ తగిలింది. అవినీతి నిరోధక చట్టం కింద డెమోక్రాట్ సభ్యులు ట్రంప్ పై కేసులు పెట్టేందుకు కోర్టు అనుమతించింది. అధ్యక్షుడు ట్రంప్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ అమెరికా చట్టసభల్లోని సుమారు 200 మంది డెమోక్రాట్లు వాషింగ్టన్ డీసీలోని కోర్టులో కేసులు వేశారు. వారు అధ్యక్షుడి అవినీతిపై కోర్టులో కేసు పెట్టడానికి అనుమతిస్తూ యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎమ్మెట్ సల్లివాన్ తీర్పునిచ్చారు. ప్రపంచమంతటా ఉన్న హోటళ్లు, ఇతర వ్యాపారాలకు విదేశీ ప్రభుత్వాల నుంచి ధన, ఇతరత్రా మార్గాల్లో ప్రయోజనాలు పొంది రాజ్యంగంలోని విదేశీ లాభాల నియమాన్ని ట్రంప్ ఉల్లంఘించారని డెమోక్రాట్లు ఆరోపించారు. అయితే ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ మాత్రమే ప్రశ్నించాలి తప్ప వ్యక్తిగతంగా ప్రశ్నించే హక్కు సభ్యులుకు లేదని ట్రంప్ తరఫున వాదించిన న్యాయశాఖ లాయర్లు చెప్పారు. అమెరికా అధికారులు కాంగ్రెస్ అనుమతి లేకుండా విదేశీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి బహుమతులు, చెల్లింపులు స్వీకరించడాన్ని విదేశీ లాభాల నియమం నిషేధిస్తోంది. అయితే అధికార పర్యటన కోసం వైట్ హౌస్ వెళ్లే విదేశీ అతిథులు ట్రంప్ హోటల్ లో బస చేసేందుకు రుసుము చెల్లిస్తున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని దశాబ్దాలుగా అధ్యక్షుడు వ్యాపారాలను కొనసాగించలేదు. కానీ ట్రంప్ మాత్రం తన వ్యాపారాలకు యజమానిగా కొనసాగుతున్నారు. విదేశీ లాభాల నియమాన్ని అనుసరించి కాంగ్రెస్ నుంచి అనుమతి కూడా పొందలేదు. హౌస్, సెనేట్ లలో మెజారిటీ ఉన్న రిపబ్లికన్లు ఈ వ్యవహారాన్ని ప్రశ్నించలేదు. అధ్యక్షుడిగా ట్రంప్ అనుమతి పొందాల్సిన అవసరం లేదని ఆయన న్యాయవాదులు వాదించారు. కాంగ్రెస్ స్వతంత్రంగా వ్యవహరించవచ్చని తెలిపారు. కేసులు పెట్టిన డెమోక్రాట్లు ట్రంప్ రాజ్యాంగబద్ధుడిగా ఉండేందుకు కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.