సీబీఐలో ‘అంతర్యుద్ధం’.

ప్రకాశ్, న్యూఢిల్లీ:

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఉన్నతాధికారుల మధ్య వైరం ముదురు పాకాన పడింది. కొన్నాళ్లుగా సాగుతున్న అంతర్గత కలహాలు ఇప్పుడు వీధిన పడ్డాయి. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, ఆయన కింద పనిచేసే స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకి మధ్య కొనసాగుతున్న పోరు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. వర్మపై ఆస్థానా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం సీబీఐలో పెద్ద కలకలం రేపింది. తనపై ఆస్థానా దురుద్దేశంతో ద్వేషపూరిత, పనికిమాలిన బహిరంగ వ్యాఖ్యలు చేశారని వర్మ ఆరోపించారు. మరోవైపు సీబీఐలోని పలువురు అధికారులు మాత్రం రాకేష్ ఆస్థానాపై మండిపడుతున్నారు. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మపై ఆస్థానా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు.అటు సీబీఐ అధికార వర్గాలు సైతం ఆస్థానాపై విరుచుకుపడుతున్నాయి. వివిధ కేసుల దర్యాప్తుల్లో ఆస్థానా తమను బెదిరించారని పలువురు అధికారులు ఆరోపిస్తున్నారు. ఆరు వేర్వేరు అవినీతి కేసుల్లో ఆస్థానా పాత్రపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసుల విచారణ జరుపుతున్న అధికారులను ఆస్థానా బెదిరించారని తెలిసింది. కీలక కేసుల్లో విచారణను నిలిపేయాలని ఆలోక్ వర్మ ఆదేశించినట్టు రాకేష్ ఆస్థానా చేసిన ఆరోపణలను సీబీఐ సిబ్బంది కొట్టి పారేశారు. సీబీఐ డైరెక్టర్ వ్యక్తిత్వంపై బురద జల్లేందుకు బహిరంగంగా నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఏకంగా సీబీఐ డైరెక్టర్ పై ఆరోపణలు చేసి అధికారులపై ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్న ఐఆర్సీటీసీ కుంభకోణం విచారణను నిలిపేయాల్సింది సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ ఆదేశించారని స్పెషల్ డైరెక్టర్ గా ఉన్న రాకేష్ ఆస్థానా ఆరోపించడంతో సీబీఐలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉన్నతాధికారుల విభేదాలు బట్టబయలయ్యాయి.