చంద్రబాబు ప్రచార రథం సిద్ధం. -రెండు వైపులా ఎల్‌ఈడీ స్ర్కీన్లు. -అభివృద్ధిని తెలిపే చిత్రాలు. -వెలుగులు విరజిమ్మే ఫ్లడ్‌లైట్లు. -అదిరిపోయే సౌండ్‌ సిస్టం.

చంద్రబాబు ప్రచార రథం సిద్ధం.
-రెండు వైపులా ఎల్‌ఈడీ స్ర్కీన్లు.
-అభివృద్ధిని తెలిపే చిత్రాలు.
-వెలుగులు విరజిమ్మే ఫ్లడ్‌లైట్లు.
-అదిరిపోయే సౌండ్‌ సిస్టం.

null
అమరావతి:

సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడుతోంది. ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకుపోయేందుకు నేతలంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రచారానికి ఉపయోగించే వాహనాల తయారీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచార రథాలను తయారు చేయడంలో ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న గుంటూరులోని జయలక్ష్మీ మోటార్స్‌ ఈ పనుల్లోనే నిమగ్నమైంది. సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌తోపాటు మరో 25 మంది ఎంపీ అభ్యర్థులు వాహనాల తయారీ కోసం ఈ సంస్థకు ఆర్డర్లు ఇచ్చారు. జయలక్ష్మీ డిజైనర్స్‌ అధినేత నారయ్య చౌదరి ఆధ్వర్యంలో డిజైనర్‌ అట్లూరి ప్రసాద్‌ ఈ వాహనాల తయారీలో బిజీగా ఉన్నారు. సీఎం చంద్రబాబు కోసం భారీ ఐషర్‌ వాహనాన్ని ప్రచార రథంగా సిద్ధ్దం చేస్తుండగా.. టీడీపీ ప్రకాశం జిల్లా నాయకుడు గొట్టిపాటి రవికుమార్‌ కోసం పూర్తి ఎలక్ర్టానిక్‌ ఎల్‌ఈడీ ప్రచార రథాన్ని తొలిసారి సిద్ధం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు జయలక్ష్మీ మోటార్స్‌ ప్రత్యేక ప్రచార రథాన్ని సిద్ధం చేసింది. ఐషర్‌ కంపెనీకి చెందిన వాహనం బాడీని తీసుకుని దాన్ని 15 రోజుల్లో ప్రచార రథంగా సిద్ధం చేసినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మరో రెండు రోజుల్లో సీఎంకు అందజేయనున్న ఈ వాహనంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.ఇప్పటి వరకు చిన్న చిన్న వాహనాలనే ప్రచార రథాలుగా సిద్ధం చేస్తున్న జయలక్ష్మీ డిజైనర్స్‌ తొలిసారిగా భారీ ఐషర్‌ వాహనాన్ని ప్రచార రథంగా సిద్ధ్దం చేసింది. ఈ వాహనానికి ఇరువైపులా నాలుగు అడుగుల వెడల్పు, మూడు అడుగుల ఎత్తు కలిగిన ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వీడియోలను ప్రసారం చేయొచ్చు. వాహనానికి నాలుగు వైపులా అత్యాధునిక సౌండ్‌ సిస్టమ్స్‌ ఉంటాయి. వాహనం చుట్టూ ఈ నాలుగున్నర ఏళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాల, సంక్షేమ పథకాల చిత్రాలను ముద్రించారు. వాహనం మీద ఉన్న వారికి కింద ఉన్నవారు రాత్రి వేళ సైతం స్పష్టంగా కనిపించేలా భారీ ఎల్‌ఈడీ ఫ్లడ్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ఎల్‌ఈడీ స్ర్కీన్లకు, ఫ్లడ్‌ లైట్లకు విద్యుత్‌ అందించేందుకు అత్యంత సామర్థ్యం కలిగిన జనరేటర్‌ ఉంటుంది. వాహనంపైకి తేలిగ్గా ఎక్కేందుకు రెండు అంచెలుగా మెట్లు ఏర్పాటు చేశారు. వాహనంపై ఒకేసారి 25-30 మంది నిలబడేలా స్థలం ఉంటుంది.