ఎన్నికలకు సిద్ధంకండి: నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.

ఎన్నికలకు సిద్ధంకండి:
నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.
chandrababu calls tdp to prepare for elections

అమరావతి:

2019 ఎన్నికలకు సిద్ధమవ్వాలని నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రతీ ఒక్కరికీ వివరించాలని సూచించారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. త్వరలో అమల్లోకి తేనున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. అలాగే రైతు రక్ష పథకం, పసుపు కుంకుమ పథకాలపై సమీక్షించారు. ఎన్నికలకు వెళ్లేలోగా వీలైనన్ని సంక్షేమ కార్యక్రమాల అమలుకు కసరత్తు చేపట్టారు. టీడీపీ సభ్యత్వ నమోదు, అసెంబ్లీ సమావేశాలు, జయహో బీసీ సభ, అమరావతి ధర్మ పోరాట సభపై కూడా చర్చించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలతో ఉన్న స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అంటించాలని ఆదేశించారు. ఈ పనికి సేవా మిత్రలను వాడుకోవాలన్నారు. బూత్‌ కమిటీ కన్వీనర్లు ఎంత పని చేస్తే… అంత ఫలితం ఉంటుందని చెప్పారు. టీడీపీ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా చూడాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని ఆహ్వానించాలని స్పష్టంచేశారు. అలాగే ఎన్నికల మానిఫెస్టోను రూపొందించుకోవాలని ఆదేశించారు. దేశంలో రైతులకు ఎక్కువ న్యాయం చేసింది టీడీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. తెలంగాణ చేసింది తక్కువ… ప్రచారం ఎక్కువని విమర్శించారు. ప్రతీ కుటుంబానికి స్మార్ట్‌ ఫోన్‌ ఇద్దామన్నారు. పోలవరం, రామాయపట్నం, రాజధాని నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు.