‘మార్పు’ అనివార్యం. ‘ఏకగ్రీవ’గ్రామంలో తప్పని ఎన్నికలు!!

‘మార్పు’ అనివార్యం.
‘ఏకగ్రీవ’గ్రామంలో తప్పని ఎన్నికలు!!

null

విశ్వనాథ్, కరీంనగర్:

దశాబ్దాలు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోకుంటే.. ఆ గ్రామంలో ఓటు ద్వారా మార్పుకు సిద్ధపడాల్సిందేననుకున్నారు ఆ ఊరి ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు కనీవిని ఎరుగని ఊళ్లల్లో కూడా ఓవైపు పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమైతుంటే… అక్కడ మాత్రం సీన్ రివర్సైంది. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఏకగ్రీవమైన ఆ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది. ఆ ఊరుకెళ్లాలంటే.. జగిత్యాల జిల్లాలో ఊరి పేరు చింతలూరు. రాయికల్ మండలంలోని ఈ గ్రామంలో.. గత 37 ఏళ్లుగా ఏకగ్రీవంగానే సర్పంచులు ఎన్నికవుతూ వస్తున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న గ్రామపంచాయితీగా చింతలూరు చరిత్రకెక్కగా… తెలంగాణాలోనే రికార్డు వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవమైన పంచాయతీగా కూడా ఈ ఊరు హిస్టరీ క్రియేట్ చేసింది. 1981 లో బోర్నపల్లి నుండి వేరుపడినప్పటి నుండి ఈగ్రామానికి ఓటింగ్ అంటే తెలియదు. ఇక్కడ అన్నీ ఏకగ్రీవాలే. సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయితీలకిచ్చే 5 వేలు,10 వేలు, 15 వేలు, 5 లక్షలు, 8 లక్షల 50 వేల రివార్డులు కూడా ఈ చింతలూరు గ్రామమందుకుంది. రాయికల్ మండలం చింతలూర్ లో 1981కి పూర్వం బోర్నపల్లి, జగన్నాధపూర్, దావన్ పల్లి గ్రామాలలో అంతర్భాగంగా ఉన్న చింతలూరు.. ఆతర్వాత బోర్నపల్లి గ్రామపంచాయితీలో అనుబంధ విలేజ్ గా కొనసాగింది. ఆ తర్వాత బోర్నపల్లి నుండి విడివడి.. 1981 లో చింతలూరు గ్రామపంచాయితి ఏర్పడింది. గ్రామపంచాయితి ఏర్పడిన మొదటిసారి జనరల్ కు కేటాయించారు. ఐక్యతకు మారుపేరైన ఈ గ్రామస్తులంతా సమావేశమై ఎస్టీ తెగకు చెందిన బద్రీనాయక్ ను సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ గ్రామంలో సర్పంచ్ వార్డు సభ్యులకు ఎన్నికల్లో ఓటింగ్ జరగలేదు. 1988 లో జనరల్ కు కేటాయించగా.. బీసీ వర్గానికి చెందిన అనుపురం లింబాగౌడ్ ను రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2001 లో జనరల్ కు కేటాయించగా.. ఓసీ వర్గానికి చెందిన ఓరుగంటి మోహన్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇలా 2013 వరకూ ఇలా ఏకగ్రీవాల పరంపర కొనసాగగా… బషీర్ తండాను కలుపుకుని 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామంలో సుమారు 900 మంది జనాభా ఉండగా 650 మంది ఓటర్లు ఉన్నారు. తాజా ఎన్నికల్లో ఈ గ్రామాన్ని జనరల్ కు కేటాయించగా్. తిరిగి ఏకగ్రీవం చేయడానికి గ్రామస్తులంతా ప్రయత్నించారు. మళ్లీ ఏకగ్రీవమైతే ప్రభుత్వ నజరానా 10 లక్షలతో పాటు ఎమ్మెల్యే నిధుల నుండి మరో 15 లక్షల రూపాయలు కేటాయిస్తామన్న కేటీఆర్ హామీతో మొత్తం 25 లక్షలతో గ్రామంలో భారీ అభివృద్ది జరిగే అవకాశం ఉంది. కానీ..ఇప్పుడిక్కడ సీన్ రివర్సైంది. కారణం పేరుకే ఏకగ్రీవంగా ఎన్నికలు మినహాయిస్తే.. అభివృద్ధి విషయంలో ఒరిగిందేమీ లేదు. దీంతో..ఈసారి ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న పట్టుదలకొచ్చారు ఈ ఊరి ఓటర్లు. 37 ఏళ్లుగా ఏమి చేయనివారు.. ఎప్పుడేంచేస్తారని అడుగుతున్నారు. దీంతో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం 4 గురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ఒకరు ఉపసంహరించుకోగా… మరో ముగ్గురు మాత్రం బరిలో నిల్చారు. 37 ఏళ్లుగా ఏకగ్రీవం చేస్తూ వచ్చారు కానీ.. గ్రామంలో చూస్తే కనీస వసతులు లేవని.. ఈ సారి కచ్చితంగా పోటీలో ఉంటామంటున్నారు ఈ ముగ్గురు. గత 37 సంవత్సరాలుగా ఏకగ్రీవ పంచాయితీగా ఎన్నికైనప్పటికీ.. గ్రామ ప్రధాన సమస్యలైన తాగునీరు, సాగునీరు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు ఇళ్లు, గుడిసెలపై నుండి వెళ్తున్న కరెంటు వైర్లు ప్రధాన సమస్యగా ఉన్నాయని.. అలాంటి ప్రధాన సమస్యలను పరిష్కరించే వారికే తమ ఓటు వేయనున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా పలు పంచాయతీల్లో పోటీలు పెట్టుకుని మరీ ఏకగ్రీవాల హవా నడుస్తోంటే.. మరికొన్ని చోట్ల నయానో, భయానో ఎన్నికల కమిషన్ ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తూ ఏకగ్రీవాల పర్వం కొనసాగుతుంటే.. 37 ఏళ్లుగా ఏకగ్రీవాలకు పెట్టింది పేరై చరిత్ర సృష్టించిన చింతలూరులో సీన్ రివర్సై ఎన్నికలనివార్యమవ్వడమే ఇప్పుడు పెద్ద వార్త.