ఉన్నతాధికారులలో మార్పు!! కాంగ్రెస్ నేతలతో మాటా మంతీ! భవిష్యత్తుపై టెన్షన్!!

రాజీవ్, హైదరాబాద్:

అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార యంత్రాంగంలో ఏం జరుగుతున్నది? ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నవారు కొందరైతే మరి కొందరు రోజూ వారీ పనుల్లో మునిగితేలుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి వివిధ ప్రభుత్వ విభాగాల అధిపతులు రాబోయే రోజుల్లో రాబోయే ప్రభుత్వం ఏ పార్టీకి సంబంధించినది ఉంటుందనే చర్చలే చేసుకుంటున్నారు.తమ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్నదనే చర్చలు కూడా ప్రభుత్వ అధికార కేంద్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ టిఆర్‌ఎస్ పార్టీకి కొమ్ము కాసిన అధికారులు ఇప్పుడు పునరాలోచనలో పడినట్లుగా కనిపిస్తున్నది. వారి మాటలు వింటుంటే అధికారం మారితే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. అంతే కా కుండా టీఆర్‌ఎస్ పాలనలో ముఖ్యమైన పోస్టింగులు రాని అధికారులు కొందరు కాంగ్రెస్ నాయకులతో మాటా మంతి మొదలు పెట్టారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తాము చేసిన పనులు, తమకు కాంగ్రెస్ నాయకులతో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ నాయకులను ఏ ఉన్నతాధికారి కూడా పట్టించుకోలేదు. కాంగ్రెస్ నాయకులు ప్రజా సమస్యలను వినతి పత్రాల రూపంలో తీసుకువచ్చినా తృణీకరించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కాంగ్రెస్ నాయకులతోనే అధికారులు మాటలు కలుపుతున్నారు. గతంలో తమకు కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కొందరు ఐఏఎస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్కను కలిసినట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత మిగిలిన అధికారుల వైఖరిలో కూడా మార్పు వచ్చినట్లు కనిపిస్తున్నది.
టిఆర్‌ఎస్ హయాంలో తామే అధికార కేంద్రాలుగా పెత్తనం చెలాయించిన ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు కూడా ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు ఒక ఉన్నతాధికారి చెప్పారు. అలాంటి అధికారులు ఇప్పుడు రోజూవారీ పనులు చేసుకుంటూనే భవిష్యత్తు గురించి చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నిర్వహించే పార్టీ మారితే తమ పరిస్థితి ఏమిటని చర్చించుకోవడం చూస్తే ఓడలు బళ్లు కావడం బళ్లు ఓడలు కావడమనే సామెత గుర్తుకు వస్తున్నదని మరొక సీనియర్ అధికారి వ్యాఖానించారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడప్పుడు ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు ప్రయత్నించినా కనీసం సమయం కూడా ఇవ్వని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు, ఉన్నతాధికారులు ఇప్పుడు కాంగ్రెస్ నాయకు లకు ఫోన్ చేసి మరీ మాటకలపడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏం జరగబోతున్నదనేది అర్ధం అవుతున్నదని ఒక ప్రభుత్వ శాఖాధిపతి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతో ఎవరు సన్నిహితంగా ఉంటారో తెలుసుకుని వారి వద్దకు రాయబారం పంపుతున్న ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో తమను బాగా చూసుకోవాలని వారు మధ్యవర్తుల ద్వారా కోరుకుంటున్నారు.గతంలో అధికారుల నుంచి తమకు ఎదురైన చేదు అనుభవాలను ఇప్పుడు అధికారులు వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ నాయకులు బేరీజు వేసుకుంటున్నారు. టిఆర్‌ఎస్ పాలన ప్రారంభమైన కొత్తలో మంత్రులు, టిఆర్‌ఎస్ నాయకుల కన్నా ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేసిన అధికారులు కూడా తమకు తెలుసునని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇటీవలి కాలంలో ఐపిఎస్ అధికారుల్లో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదని ఒక కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. అదే విధంగా కింది స్థాయి పోలీసు అధికారుల్లో కూడా మార్పు కనిపిస్తున్నది. కొందరు కింది స్థాయి పోలీసు అధికారులు టిఆర్‌ఎస్ కార్యకర్తల మాదిరి గా వ్యవహరించిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మర్చిపోలేదు. ఇప్పుడు పోలీసులలో వచ్చిన ఈ మార్పు చూసి కాంగ్రెస్ నాయకులే ఆశ్చర్యపోతున్నారు.నిబంధనలకు అనుగుణంగా పనులు చేసిన ఐఏఎస్, ఐపిఎస్ ఇతర శాఖల అధిపతులు మాత్రం ఇలాంటి చర్చలకు ఎలాంటి ఆస్కారం ఇవ్వడం లేదు. తాము ప్రభుత్వ అధికారులం మాత్రమేనని అదే విధంగా ప్రవర్తిస్తామని తమకు రాజకీయాలతో సంబంధం లేదని అంటున్నారు. నిబంధనల ప్రకారం పని చేయడం మాత్రమే తమకు తెలుసని, తాము రాజకీయ ప్రాపకంతో ఉన్నత స్థానాలు సాధించిన వారం కాదని వారు అంటున్నారు. అయితే రాష్ట్రంలో చాలా మంది ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉండేది. ప్రజా సమస్యలను ప్రస్తావించేం దుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులతో వారు వ్యవహరించిన తీరు కూడా అప్పటిలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉన్నతాధికారులలో వచ్చిన ఈ మార్పును చూసి కాంగ్రెస్ నాయకులే విస్మయం చెందుతున్నారు.