వైరల్ వీడియో: ఉద్యోగులను కుక్కలుగా మార్చిన చైనా కంపెనీ

వైరల్ వీడియో: ఉద్యోగులను కుక్కలుగా మార్చిన చైనా కంపెనీ
China Company forces employees to crawl on roads

ఒక చైనా కంపెనీ సభ్యసమాజపు హద్దులు దాటి దారుణమైన చర్యకు పాల్పడింది. తన ఉద్యోగులతో అమానవీయంగా ప్రవర్తించింది. వాళ్లను కుక్కలుగా మార్చి రోడ్లపై నడిపించింది. ఇదంతా ఎందుకు చేసిందంటే కంపెనీ ఇచ్చిన టార్గెట్లను ఆ ఉద్యోగులు పూర్తి చేయలేదు. చైనా కంపెనీ చర్యను ప్రపంచవ్యాప్తంగా అనేక మానవ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ఏడాది చివరి నాటికి పూర్తి చేయాల్సిందిగా చైనా కంపెనీ తన ఉద్యోగులకు ఓ టార్గెట్ ఇచ్చింది. కానీ వారు ఆ టార్గెట్ పూర్తి చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఆగ్రహించిన కంపెనీ యాజమాన్యం వారిని కుక్కల మాదిరిగా మోకాళ్లు, చేతులపై పాకుతూ రోడ్లపై నడవాల్సిందిగా ఆదేశించింది. అది కూడా భారీ ట్రాఫిక్ ఉండే ఒక రోడ్డులో బలవంతంగా ఈ పొజిషన్ లో నడిపించింది.

నిండు ట్రాఫిక్ లో ఈ ఉద్యోగులు కుక్కల మాదిరిగా మోకాళ్లు, చేతులపై నడుస్తుంటే ఒక వ్యక్తి జెండా పట్టుకొని ముందు నడిచాడు. రద్దీ రోడ్డుపై వీళ్లు ఇలా నడుస్తుంటే ఏదైనా వాహనం వచ్చి వీళ్లను తొక్కేసి వెళ్లకుండా కంపెనీ ఈ ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారం చూసేందుకు రోడ్డుపై జనం గుమికూడటం, ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు జోక్యం చేసుకొని ఈ తిక్క మార్చ్ ని మధ్యలోనే ఆపేశారు. కానీ అప్పటికే ఈ ఘటన తాలూకు వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.

కంపెనీ ఉద్యోగులను ఈ పరిస్థితుల్లో చూసిన పలువురు కోపోద్రిక్తులు కావడాన్ని వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. రిపోర్ట్స్ ప్రకారం కంపెనీని తాత్కాలికంగా మూసేశారు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన తర్వాత కంపెనీ భారీ విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కంపెనీ చర్యపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినవారు కొందరైతే మరికొందరు ఉద్యోగులను తప్పుబట్టారు. ప్రతిఘటించకుండా కంపెనీ ఇచ్చే డబ్బుల కోసం తమ ఆత్మాభిమానాన్ని వదులుకొని ఇలాంటి పిచ్చి ఆదేశాలను పాటిస్తారా అని ప్రశ్నించారు.