కేసీఆర్, హరీశ్ ల మధ్య ‘ప్యాచప్’ అయినట్టేనా!! నాలుగైదు రోజుల్లో చింతమడకకు కేసీఆర్

zakeer.sk:

టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన మేనల్లుడు, మాజీ మంత్రి హరీశ్ ల మధ్య ‘గ్యాప్’ తొలగిపోయినట్టు టిఆర్ఎస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక తమ నాయకునికి పార్టీలో,ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యమూ, సముచిత గౌరవమూ లభిస్తాయని హరీష్ రావు మద్దతుదారులు భావిస్తున్నారు. టిఆర్ఎస్ రెండో టర్మ్ ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి దక్కనందుకు వారంతా తీవ్ర నిరాశానిస్పృహల్లో, నిర్వేదంలో ఉన్నారు. అయితే కొద్దీ రోజుల క్రితం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేసీఆర్,హరీశ్ మధ్య మాటలు కలిశాయని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. అదే రోజు కొత్త సెక్రెటేరియేట్ శంకుస్థాపన సందర్భంగా హరీష్ రావు, కేటీఆర్ మధ్య సంభాషణ కూడా ఆసక్తి రేపింది.హరీశ్ రావు, కేసీఆర్ ల మధ్య ‘గ్యాప్’ తొలగడానికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాయబారం కారణమని తెలుస్తున్నది. త్వరలో జరిగే రాష్ట్ర మంత్రిమండలి విస్తరణలో హరీశ్ కు చోటు లభించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగుతున్నది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన స్వగ్రామం సిద్ధిపేట జిల్లా చింతమడకకు నాలుగైదు రోజుల్లో వస్తున్నారు.

గ్రామస్థులతో,తన చిన్ననాటి మిత్రులతో ఆయన ‘ఆత్మీయ సమేళనం’ జరపనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మాజీ మంత్రి హరీశ్ రావు పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఒకరోజంతా తన సొంతూరిలో ఉండాలని, గ్రామ ప్రజలతో కలిసి భోజనం చేయాలని, గ్రామ సమస్యలన్నీ పరిష్కరించాలని భావించారు. పనుల ఒత్తిడి కారణంగా రాలేక పోయారు. కేసీఆర్ రాక కోసం ‘చింతమడక’ రెడీ అవుతోంది. తమ గ్రామంలో పుట్టి, తమ కళ్లెదుట పెరిగి అత్యున్నత స్థాయికి ఎదిగిన ముఖ్యమంత్రితో ఓ రోజంతా గడిపేందుకు ఆ గ్రామం ఆరాటపడుతోంది. 2014 లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అఖండవిజయంతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2019 లో రెండోసారి కూడా మళ్లీ టీఆర్‌ఎస్‌ను అధికారం లోకి తెచ్చి ముఖ్యమంత్రి అయ్యారు.ముఖ్యమంత్రి చింతమడక పర్యటన నేపథ్యంలో గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. చింతమడక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికతో కూడిన నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డికి ఆదేశాలు అందాయి. గ్రామంలో తాగు నీటి సరఫరా, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారి వివరాలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలు, వ్యవసాయం, ఉపాధి హామీ పథకం కింద గ్రామ ప్రజలకు పని దినాలు, జాబ్ కార్డులు, రెవెన్యూ భూమి కలిగి ఉన్నవారెంత మంది? అసైన్డు భూమిలో ఎస్సీ, బీసీ కుటుంబాలు ఎన్ని? భూమిలేని కూలీలు ఎంత మంది? సహా పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు.

మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేసీఆర్ దంపతులు చింతమడకకు వచ్చారు. ఆ సందర్భంగా 15 రోజుల్లో గ్రామానికి వస్తానని, రోజంతా గ్రామస్థులతో గడిపి, వాళ్లతో కలిసి భోజనం చేసి వెళ్తానని మాట ఇచ్చారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలో అధికారులు ఇంటింటికీ సర్వే చేసి తుది నివేదికను కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డికి అందజేశారు. సీఎం కేసీఆర్ చింతమడక గ్రామానికి పర్యటన ఏర్పాట్లపై మాజీమంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిలు అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.గ్రామంలోని రైతులు ఏ పంటలు సాగు చేస్తున్నారు. ఎంతమందికి రైతుబంధు వచ్చింది.. రైతుబీమా ఎంత మందికి వర్తించింది. రైతులు పండించిన పంటలను ఎక్కడ విక్రయిస్తున్నారు. దిగుబడి ఎంత వస్తుంది. ఆరుతడి, కూరగాయల పంటలు పండిస్తున్నారా.. సాగువిధానం ఎలా ఉంది తదితర అంశాలతో కూడిన నివేదికలను వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించారు.

హరితహారం కింద ఏ రకమైనటువంటి మొక్కలు నాటారు. నాటిన మొక్కల్లో ఎన్ని బతికి ఉన్నాయి. వీటితో పాటు గ్రామంలో పొలం గట్లపై మొక్కలు నాటిన రైతుల వివరాలను కూడా సేకరించారు. కూరగాయల సాగు పందిళ్లు ఉన్నాయా.. లేవా.. ఏ రైతు చేసుకోవాలనుకుంటున్నాడు.. పాలిహౌస్, వ్యవసాయ పనిముట్లతో పాటు ఇతర అంశాలను కూడా వ్యవసాయ శాఖ ప్రత్యేక సర్వేలో పొందుపర్చారు. గతంలో ఏఏ పంటలు పండిస్తే ఎంత లాభాలు వచ్చాయో… ఇప్పుడున్న పరిస్థితి ఏంటిది.. ఇలా ప్రతి అంశాన్ని నివేదికలో పొందుపర్చారు. గ్రామంలో 48 డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశారు. మరో 24 ఇండ్ల నిర్మాణం పూర్తి దశలో ఉన్నాయి. 14 ఇండ్లకు ఇటీవలనే శంకుస్థాపనలు చేశారు. ఇవి కాకుండా గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలను గుర్తిస్తున్నారు. భూ పంపిణీ కింద అర్హులైన వారు ఎంత మంది ఉన్నారు. నూతనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో భాగంగా చింతమడక గ్రామానికి బాలికల గురుకుల పాఠశాలలను మంజూరు చేశారు. కానీ విద్యార్థులకు సరిపడా వసతి లేకపోవడంతో సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ శివారులో గల ప్రైవేట్ భవనంలో ప్రారంభించారు. అయితే చింతమడకకు సీఎం కేసీఆర్ వస్తే ఆ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.