భూప్రక్షాళన ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం: సీఎం కేసీఆర్‌

భూప్రక్షాళన ద్వారా అసాధ్యాన్ని
సుసాధ్యం చేశాం: సీఎం కేసీఆర్‌

null

హైదరాబాద్:

నియోజకవర్గానికి ఒకటో, రెండో ఫుడ్ యూనిట్లు నెలకొల్పుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్ల బాధ్యత ఐకేపీ మహిళలకు అప్పగిస్తామన్నారు. కంటి వెలుగు పథకం కింద ఇంకా ఆపరేషన్లు ప్రారంభించలేదన్నారు. ఆపరేషన్ల వల్ల కొందరు కళ్లు కోల్పోయారని చెప్పడం అసత్యమని సీఎం అన్నారు. నిజాం హయాం తర్వాత భూ సర్వే చేయలేదని.. సమస్యలు పట్టించుకోలేదని కేసీఆర్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూప్రక్షాళన ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశామన్నారు. 5 నుంచి 6శాతం లిటిగేషన్‌ భూములు ఉన్నాయని, భూరికార్డుల మార్పిడిలో అవినీతి లేకుండా చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ధరణి వెబ్‌సైట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తహసీల్దార్‌ ఆఫీసులోనే భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, ఇకపై పహాణి నకలు, ఇతర కాగితాల సమస్య ఉండదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. పాస్‌పుస్తకాలు లేకుండా బ్యాంకుల్లో రైతులకు పంటరుణాలు ఇవ్వడం సాధ్యంకాదన్నారు. రైతు ఎలా మరణించినా 10 రోజుల్లో ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటివరకు 6,600 మంది రైతులకు బీమా పరిహారం అందించినట్లు కేసీఆర్‌ వెల్లడించారు. కంటి వెలుగు తర్వాత ప్రజలకు ఈఎన్‌టీ పరీక్షలు చేయిస్తామని, ప్రజలందరికీ రక్త పరీక్షలు చేసి హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేస్తామని సీఎం స్పష్టం చేశారు.