మోడీపై అమెరికా సర్కార్ కి ఫిర్యాదు!!

ప్రకాశ్, న్యూఢిల్లీ:

భారత ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికా సర్కార్ కి ఫిర్యాదు చేసిన వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ డెబిట్, క్రెడిట్ కార్డుల సంస్థ ‘Master Card‘ జూన్ నెలలో అమెరికా ప్రభుత్వానికి కంప్లెయింట్ చేసింది. దేశీయ పేమెంట్ నెట్ వర్క్ ‘RuPay‘ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పీఎం మోడీ జాతీయతతో ముడిపెట్టడంపై మాస్టర్ కార్డ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్ తన దగ్గర ఉన్న పత్రాల ఆధారంగా తెలియజేసింది. భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం కారణంగా విదేశీ పేమెంట్ కంపెనీలకు భారీ నష్టం కలుగుతుందని మాస్టర్ కార్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. మోడీ సర్కార్ కొన్నేళ్లుగా భారతీయ పేమెంట్ నెట్ వర్క్ ‘రూపే‘ని ప్రోత్సహిస్తోంది. దీంతో అమెరికాకు చెందిన మాస్టర్ కార్డ్, వీసా వంటి దిగ్గజ పేమెంట్ కంపెనీల హవా తగ్గుముఖం పట్టింది. భారత్ లోని 1 బిలియన్ డెబిట్, క్రెడిట్ కార్డుల్లో సగానికి పైగా రూపే పేమెంట్ సిస్టమ్ కింద ఉపయోగంలో ఉన్నాయి. దీంతో మాస్టర్ కార్డ్ కి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది.పీఎం మోడీ స్వదేశీ కార్డ్ పేమెంట్ నెట్ వర్క్ ప్రారంభిస్తూ రూపే కార్డ్ వినియోగం దేశానికి సేవ చేయడం అన్నారు. దీని ట్రాన్సాక్షన్స్ తో వచ్చే రుసుము దేశంలో రోడ్లు, స్కూళ్లు, హాస్పిటళ్ల వంటివి నిర్మించడానికి ఉపయోగ పడుతుందని చెప్పారు. మోడీ మాటలను ఉటంకిస్తూ జూన్ 21న మాస్టర్ కార్డ్ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యుఎస్టీఆర్)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. మాస్టర్ కార్డ్ వైస్ ప్రెసిడెంట్ సహారా ఇంగ్లీష్ తన ఫిర్యాదులో ‘ప్రధానమంత్రి డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషి అభినందనీయం. కార్డు వినియోగానికి జాతీయతను జోడించడం మార్కెట్ పరిరక్షణ చర్యల్లో భాగంగా భావించాలి. ఇటీవల భారత ప్రభుత్వం సంరక్షణ చర్యలు ప్రారంభించింది. ఇది బహుళజాతి కంపెనీల నష్టం కలిగిస్తుంది. మోడీ సర్కార్ చర్యల వల్ల అమెరికా కంపెనీలు నష్టాల పాలవుతున్నాయి. రూపేని ప్రోత్సహించేందుకు పీఎం మోడీ, ఆయన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల అమెరికా పేమెంట్ టెక్నాలజీ సంస్థలకు మార్కెట్లోకి చొచ్చుకుపోవడం కష్టమవుతోందని‘ తెలిపారు. రాయిటర్స్ సంపాదించిన మరో నోట్ ప్రకారం మోడీ రూపే వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నందువల్ల మాస్టర్ కార్డుకి కొంత కాలం నష్టాలు వస్తున్నట్టు తెలిసింది.