కంప్యూటర్ బాబాను బహిష్కరించిన అఖాడా!!

Computer Baba

న్యూఢిల్లీ:

మధ్యప్రదేశ్ లో హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల పోరులో అధికార బీజేపీకి వ్యతిరేకంగా సాధువులను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న కంప్యూటర్ బాబాను దిగంబర్ అఖాడా గురువారం బహిష్కరించింది. రాజకీయ పోరాటంలో పాలుపంచుకొని సాధువుల గౌరవాన్ని మంట గలుపుతున్నారనే ఆరోపణల కారణంగా ఆయనపై చర్య తీసుకుంటున్నట్టు అఖాడా ప్రకటించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ కి వ్యతిరేకంగా కంప్యూటర్ బాబా ‘సంత్ సమాగమ్‘ ఆందోళన ప్రారంభించి శివరాజ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు.
‘మా సూచనల మేరకు కంప్యూటర్ బాబాను దిగంబర్ అఖాడా నుంచి బహిష్కరించినట్టు‘ సాధుసంతుల 13 ప్రముఖ అఖాడాలకు పెద్దగా వ్యవహరించే అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి తెలిపారు. ‘ఆయన సాధువుల గౌరవానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఎన్నికల బరిలోకి దూకారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్నాళ్లు బీజేపీ, కొన్నాళ్లు కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నార‘ని ఆయన ఆరోపించారు.
కుంభమేళా షాహీ స్నానానికి దూరం:
వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే సాధువులకు చెందిన దిగంబర్ అఖాడా నుంచి కంప్యూటర్ బాబాను బహిష్కరించాలని ఉజ్జయినిలో సమావేశమైన అత్యున్నత సమావేశంలో నిర్ణయించినట్టు మహంత్ నరేంద్ర గిరి చెప్పారు. బహిష్కరణ కారణంగా కంప్యూటర్ బాబా అఖాడా కార్యక్రమాలకు, సాధువుల సామూహిక భోజనాల్లో పాల్గొనడం వంటి వాటికి దూరమవుతారన్నారు. రాబోయే జనవరి 15న ప్రయాగరాజ్ (అలహాబాద్)లో ప్రారంభమయ్యే కుంభమేళాలో అఖాడా తరఫున షాహీ స్నానం, ఇతర ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనబోరని తెలిపారు.తనను అఖాడా నుంచి బహిష్కరించడంపై కంప్యూటర్ బాబా ఎదురుదాడికి దిగారు. ‘శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నాకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేసినా పవిత్ర నర్మదానది చెంగుపై మచ్చ రానీయబోనని.. గోమాతకు దుర్దశని సహించబోనని‘ చెప్పారు. ‘హిందూ ధర్మం రక్షన కోసం ఇక ముందు కూడా పోరాడతానని‘ ప్రకటించారు. ‘మధ్యప్రదేశ్ లో సాధువులు ఉపేక్షిస్తున్నారని.. వారి మఠాలు, మందిరాలు కూల్చేస్తున్నారని‘ ఆందోళన వ్యక్తం చేశారు.కంప్యూటర్ బాబా అసలు పేరు నామ్ దేవ్ దాస్ త్యాగి. ఆయన మధ్యప్రదేశ్ లోని సాధువుల సంస్థ షట్దర్శన్ సాధు మండల్ ప్రముఖుడు. ఏప్రిల్ లో శివరాజ్ ప్రభుత్వం కంప్యూటర్ బాబాతో సహా ఐదుగురు ధార్మిక నేతలకు కేబినెట్ హోదా ఇచ్చింది. శివరాజ్ సర్కార్ నర్మదను స్వచ్ఛంగా ఉంచడం, నదీగర్భంలో ఇసుక తవ్వకాలను అడ్డుకోవడం లేదని ఆరోపిస్తూ కొన్నాళ్ల క్రితం కంప్యూటర్ బాబా తన పదవికి రాజీనామా ఇచ్చారు.