కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తు.

ముంబాయి:

సాధారణ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండటంతో పార్టీల మధ్య పొత్తులు పొడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చాయి. మొత్తం 48 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ 24 స్థానాల్లో, ఎన్సీపీ 24 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించాయి. రెండు పార్టీలు తమ భాగస్వామ్య చిన్న పార్టీలకు తమ కోటా నుంచి సీట్లు కేటాయిస్తాయి.పొత్తులపై చర్చల ప్రారంభంలో ఎన్సీపీ తమకు సమానంగా సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అప్పుడు ఎన్సీపీ 21 సీట్లలో పోటీ చేసింది. కాంగ్రెస్ 26 స్థానాల్లో పోటీకి నిలిచింది. మిగిలిన ఒక సీటుని చిన్న భాగస్వామ్య పార్టీకి వదిలేశారు. ఎన్సీపీ నాలుగు సీట్లలో గెలవగా కాంగ్రెస్ రెండింటిని మాత్రమే నెగ్గింది. దీంతో తమకు ఈ సారి సరిసమానంగా సీట్లు కేటాయించాల్సిందేనని ఎన్సీపీ పట్టుబట్టింది.భారతీయ జనతా పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు పొత్తు తప్పనిసరని భావించిన కాంగ్రెస్ అధినాయకత్వం ఎన్సీపీ డిమాండ్ కు అంగీకరించింది. తమ ప్రాంతాలలో బలంగా ఉన్న చిన్న పార్టీలకు రెండు పార్టీలు తమ కోటా నుంచి సీట్లు కేటాయిస్తాయి. దీని ప్రకారం స్వాభిమాని షేట్కారీ సంఘటనకు ఆ పార్టీ నేత రాజు షెట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న హట్కనంగాలె సీటు మరోసారి దక్కనుంది. ఇది ఎన్సీపీ కోటా నుంచి సర్దుబాటు చేస్తారు. హితేంద్ర ఠాకూర్ నేతృత్వంలోని బహుజన్ వికాస్ అఘాడికి పాల్ఘర్ సీటు కాంగ్రెస్ కోటా నుంచి దక్కనుంది. ఈ పొత్తు కారణంగా ప్రకాష్ అంబేడ్కర్ నాయకత్వంలోని భారిప్ బహుజన్ మహాసంఘ్ నేరుగా కాంగ్రెస్ తో సీట్ల పంపకాల వ్యవహారాన్ని తేల్చుకోవాల్సి ఉంది. ఆయన ఎన్సీపీతో పొత్తుని తీవ్రంగా వ్యతిరేకించారు. అంబేడ్కర్ తమకు 12 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ని కోరుతూ వచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన అకోలా, షోలాపూర్ సీట్లతో సర్దుకోవచ్చని భావిస్తున్నారు. కూటమిలో అంబేడ్కర్ ను చేర్చుకొనేందుకు కాంగ్రెస్ ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.