జిమ్ బయట కాంగ్రెస్ నేత హత్య

గురువారం ఉదయం హర్యానాలోని ఫరీదాబాద్ లో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి వికాస్ చౌదరీని అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన ట్వీట్ లో ‘ఇది ఖండించాల్సిన, సిగ్గుపడాల్సిన, దుఃఖ ఘటన అని’ అభివర్ణించారు. రాహుల్ ట్వీట్ చేస్తూ ‘ఫరీదాబాద్ లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి వికాస్ చౌదరి హత్య హర్యానాలో శాంతిభద్రతల వ్యవస్థ క్షీణిస్తోందనడానికి అద్దం పడుతోంది. భగవంతుడు చౌదరి ఆత్మకు శాంతిని, ఆయన కుటుంబానికి ఈ లోటుని భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అన్నారు.

గురువారం ఉదయం జిమ్ కి వస్తున్న వికాస్ చౌదరిపై కొందరు గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆయనని ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు మరణించినట్టు ప్రకటించారు. ఈ ఘటన ఫరీదాబాద్ లోని సెక్టర్-9లో ఏషియన్ హాస్పిటల్ క్లినిక్ ఎదుట జరిగింది. ఘటన సమాచారం అందగానే సీఐడీ, సెక్టర్-8 పోలీసులు, డీసీపీ క్రైమ్ ఘటనా స్థలాన్ని పరీక్షించారు.


కాల్పులు జరిపిన ఆగంతకులు నలుగురైదుగురు కావచ్చని డీసీపీ చెప్పారు. ఇప్పటి వరకు హత్యకు కారణాలు తెలియరాలేదు. హంతకులను అరెస్ట్ చేసేందుకు సీఐడీ అన్ని బృందాలు దర్యాప్తులోకి దిగాయి. వికాస్ చౌదరి జిమ్ లోకి వెళ్తుండగా ముగ్గురు దుండగులు ఆయనను చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించారు. ఆటోమెటిక్ ఆయుధాలతో 15-20 రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు.