కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానాలు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానాలు

లోక్ సభ ఎన్నికల్లో ప్రజల తీర్పును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సిడబ్ల్యూసి) అంగీకరించింది.
కాంగ్రెస్‌కు ఓటేసిన 12.13 కోట్ల మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చింది. పార్లమెంట్ లో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంలో జవాబుదారీతనం కోసం పోరాడాలని సీడబ్ల్యుసీ నిర్ణయించింది.
ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడి అవిశ్రాంత కృషిని వర్కింగ్ కమిటీ అభినందించింది.
పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్న రాహుల్ గాంధీ ప్రతిపాదనను వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తిరస్కరించింది.
ఈ కష్టకాలంలో రాహుల్ నాయకత్వం, మార్గదర్శనం పార్టీకి అవసరమని వర్కింగ్ కమిటీ భావించింది. సైద్ధాంతిక పోరాటానికి రాహుల్ గాంధీయే నాయకత్వం వహించాలని సీడబ్ల్యూసీ సూచించింది.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, పేదల పక్షాన పోరాటం చేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై సమీక్ష, ఆత్మపరిశీలన జరగాలని భావించింది.
కాంగ్రెస్ పార్టీని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి పునర్నిర్మించి, వ్యవస్థీకరించాలని తీర్మానించారు. ఇందుకోసం త్వరితగతిన నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించారు.

దేశంలో విద్వేష శక్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని సీడబ్ల్యుసీ ప్రకటించింది.

కేంద్రంలో అధికారం చేపట్టేబోయే ప్రభుత్వం ముందు అనేక సవాళ్లున్నాయని పేర్కొంది. ఇరాన్ పై ఆంక్షల వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయని.. బ్యాంకింగ్ రంగం రూ. 12 లక్షల కోట్ల మొండి బకాయిలతో కుదేలైపోయిందని సీడబ్ల్యుసీ ఆందోళన వ్యక్తం చేసింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ఆర్థిక స్థితిగతులపై కారుమేఘాలు కమ్ముకున్నాయని పేర్కొంది.
దేశంలో ప్రైవేటు పెట్టుబడులు లేక ఆర్థిక మందగమనం ఏర్పడిందని తెలిపింది. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కనపడక యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలలో కరువుకాటకాలతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వెలిబుచ్చింది.

దేశంలో రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా తయారైందని చెప్పింది.
ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యుసీ డిమాండ్ చేసింది.
దేశం ముందున్న ఈ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని ప్రకటించింది.