క్రిస్టియానో రొనాల్డోకు 23 నెలల జైలు శిక్ష

క్రిస్టియానో రొనాల్డోకు 23 నెలల జైలు శిక్ష

null

పోర్చుగల్ కు చెందిన సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోపై రెండేళ్ల జైలుశిక్ష రద్దయింది. పన్ను మోసం కేసులో రొనాల్డోను దోషిగా తేల్చిన స్పెయిన్ లోని మ్యాడ్రిడ్ కోర్టు అతను జైలు శిక్ష అనుభవించనక్కర్లేదని ప్రకటించింది. యువెంటస్ ఫార్వర్డ్ ఆటగాడైన రొనాల్డోపై రియల్ మాడ్రిడ్ జట్టుకు ఆడుతున్న రోజుల నుంచి పన్ను ఎగవేశాడనే ఆరోపణలు ఉన్నాయి.

45 నిమిషాల పాటు కోర్టుకు వచ్చిన సాకర్ స్టార్ తన తప్పుని అంగీకరిస్తూ ఒప్పంద పత్రాలపై సంతకం చేశాడు. దీని ప్రకారం జరిమానాగా అతను 19 మిలియన్ యూరోలు (21.5 మిలియన్ డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. కోర్టులో రొనాల్డో సమర్పించిన నేరాంగీకార పత్రం ప్రకారం అతను 23 నెలల జైలు శిక్ష అనుభవించాలి. రొనాల్డో నేరం హింసాత్మకం కానందువల్ల అతను జైలు శిక్ష అనుభవించ నక్కర్లేదు. దానికి బదులు అతను ప్రొబేషన్ లో గడిపితే సరిపోతుంది.

నల్ల వ్యానులో నల్ల స్పోర్ట్స్ కోట్, నల్ల ప్యాంటులో రొనాల్డో కోర్టుకు వచ్చాడు. కోర్టులోకి మెట్లపై నుంచి నడుస్తూ వెళ్తూ ఆగి అభిమానులకు ఆటోగ్రాఫ్ లు ఇచ్చాడు. గత ఏడాది స్పెయిన్ కోర్టు ప్రాసిక్యూటర్, పన్ను అధికారుల ముందు రొనాల్డో తన నేరాన్ని అంగీకరించి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. స్పెయిన్ చట్టాల ప్రకారం రెండేళ్లు అంత కంటే తక్కువ శిక్ష పడిన మొదటిసారి నేరగాళ్ల శిక్షను జడ్జి రద్దు చేయవచ్చు.

2017లో రొనాల్డో 2011-14 మధ్య కాలంలో నాలుగు సార్లు పన్ను మోసాలకు పాల్పడినట్టు స్టేట్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు. ఈ మోసాల విలువ 14.7 మిలియన్ యూరోలు (16.7 మిలియన్ డాలర్లు) అని చెప్పారు. రొనాల్డో స్పెయిన్ బయట షెల్ కంపెనీలను ఉపయోగించి తన ఇమేజ్ రైట్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచాడనేది ప్రధాన ఆరోపణ.