డేరాబాబా కు జీవితఖైదు!!

డేరాబాబా కు జీవితఖైదు!!

Dera baba lifetime in jail

న్యూఢిల్లీ:

జర్నలిస్ట్‌ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో దోషిగా తేలిన డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఆయనతో పాటు దోషులుగా తేలిన మరో ముగ్గురు కుల్దీప్‌ సింగ్‌, నిర్మల్‌ సింగ్‌, కృషన్‌ లాల్‌కు జీవితఖైదు విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దీంతో పాటు ఒక్కొక్కరికీ రూ.50వేల చొప్పున జరిమానా విధించింది. శిక్ష ఖరారుకు సంబంధించిన విచారణకు గుర్మీత్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యాడు. 2002లో సిర్సాకు చెందిన జర్నలిస్ట్‌ ఛత్రపతిని హత్య చేసినందుకు గానూ గుర్మీత్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో వీరిని దోషులుగా తేలుస్తూ గత వారం కోర్టు తీర్పు ప్రకటించిన విషయం తెలిసిందే.అత్యాచారం కేసులో గుర్మీత్‌ ఇప్పటికే 20ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. హరియాణాలోని రోహ్‌తక్‌ సునారియా జైల్లో ఖైదీగా ఉన్నాడు. అత్యాచారం కేసు తీర్పు సమయంలో పంచకులలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగి దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో గురువారం కోర్టు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు సమీప ప్రాంతాల్లో 144సెక్షన్‌ను విధించారు.