నా వారసురాలు ఆకర్షణీయంగా ఉండాలి – ఆధ్మాత్మిక గురువు వివాదాస్పద వ్యాఖ్యలు

బౌద్ధుల ఆధ్మాత్మిక గురువు దలైలామా ఒక పెను వివాదానికి కేంద్రంగా మారారు. ఇటీవల టీవీలో ప్రసారమైన ఒక ఇంటర్వ్యూలో ఆయన తనకు వారసురాలు వస్తే ఆమె ఆకర్షణీయంగా ఉండాలని వ్యాఖ్యానించారు. బీబీసీ దక్షిణాసియా ప్రతినిధి రజనీ వైద్యనాథన్ తో మాట్లాడుతూ ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల క్రితం ఇదే ప్రశ్నను వేరే జర్నలిస్ట్ అడిగినపుడు కూడా దలైలామా పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తన వారసురాలిగా ఎవరైనా నియమితులైతే ఆమె అందంగా ఉంటేనే ప్రయోజనం ఉంటుందని దలైలామా అన్నారు. ‘ఆమె అత్యంత ఆకర్షణీయంగా ఉండాలి, లేకపోతే పెద్దగా ఉపయోగం ఉండదు’ అని చెప్పారు. అలాగే భారతీయ ముస్లింలు ప్రపంచ వ్యాప్తంగా మత సౌభ్రాతృత్వానికి ఉదాహరణగా ఉంటారని తెలిపారు.

ఈ వారం ప్రారంభంలో 84 ఏళ్ల మత గురువుని ధర్మశాలలో ఇంటర్వ్యూ చేసిన వైద్యనాథన్, 2015లో వివాదంగా మారిన ఆయన వ్యాఖ్యలను వివరించమని కోరింది. దానికి ఆయన తను తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెబుతూ ‘అంతః సౌందర్యం’ నిజమైన సౌందర్యమని చెప్పి మనుషుల బాహ్య సౌందర్యం కూడా అంతే ప్రాధాన్యం వహిస్తుందని అన్నారు.


తన వ్యాఖ్యలతో మహిళలను ఆక్షేపిస్తున్నారా అని అడిగితే దలైలామా లేదని చెప్పారు. ఆధ్యాత్మిక నాయకులు తమ భక్తులకు ‘ఆకర్షణ లేని ముఖంతో’ సందేశాలు ఇచ్చి నడిపించలేరని అన్నారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దలైలామా లింగ సమానత్వం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకత సహా అనేక అంశాలపై మాట్లాడారు. తన ‘యూరోపియన్లకే యూరప్’ వ్యాఖ్యపై వివరణ ఇచ్చారు. తను వలసలకు వ్యతిరేకిని కానని, కానీ వలసదారుల వర్గం జీవన నైపుణ్యాలు నేర్చుకొని తమ స్వదేశాల అభివృద్ధికి పాటు పడాలన్నదే తన ఉద్దేశమని తెలిపారు.