జోకోవిచ్ మళ్లీ నెంబర్ వన్!!

న్యూఢిల్లీ:

గాయాల నుంచి కోలుకొని ఈ ఏడాది మంచి ఆటతీరు కనబరిచిన సెర్బియా స్టార్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ మరోసారి నెంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగులలో జోకోవిచ్ స్పెయిన్ క్రీడాకారుడు రాఫెల్ నడాల్ ను వెనక్కినెట్టి మొదటి స్థానం సంపాదించాడు. జోకోవిచ్ ప్యారిస్ మాస్టర్స్ టోర్నమెంట్ ఫైనల్లో ప్రవేశించడంతో ఏటీపీ ర్యాంకింగులలో అగ్రస్థానాన్ని అధిష్ఠించాడు. నడాల్ ఒక స్థానం కిందికి జారి రెండో స్థానంలో నిలిచాడు. స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్ ఫెదరర్ మూడో స్థానం, అర్జెంటినాకు చెందిన జువాన్ మార్టిన్ డెల్ పోట్రో నాలుగు, జర్మనీ క్రీడాకారుడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. దక్షిణ ఆఫ్రికా ఆటగాడు కెవిన్ ఆండర్సన్ ఆరు, క్రోయేషియాకు చెందిన మారిన్ సిలిక్ ఏడు, ఆస్ట్రియాకి చెందిన డొమినిక్ థీమ్ ఏడు ర్యాంకులు నిలబెట్టుకున్నారు. జపాన్ క్రీడాకారుడు కేఈ నిషికోరి రెండు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానం సాధించాడు. అమెరికా టెన్నిస్ ఆటగాడు జాన్ ఈస్నెర్ ఒక స్థానం జారి 10వ ర్యాంకుకి చేరాడు. ప్యారిస్ మాస్టర్స్ టోర్నమెంట్ లో జోకోవిచ్ ని ఓడించి టైటిట్ నెగ్గిన రష్యా ఆటగాడు కారెన్ ఖాచానోవ్ ఏటీపీ ర్యాంకులలో ఏడు స్థానాలు దూకి 11వ స్థానంలో నిలిచాడు.