ఐఎంఏ జువెల్స్ స్కాంలో మంత్రికి ఈడీ సమన్లు


మతం పేరిట ప్రజలకు ఎరవేసి కోట్లాది రూపాయల మోసానికి పాల్పడిన ఐ మానిటరీ ఎడ్వైజరీ(ఐఎంఏ) జువెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మన్సూర్ ఖాన్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఈడీ మొహమ్మద్ మన్సూర్ ఖాన్ పై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే ప్రక్రియ ప్రారంభించింది. అలాగే పోంజీ స్కీమ్ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద 20 స్థిరాస్తులను, బెంగుళూరులో ఐఎంఏ గ్రూప్, దాని మేనేజింగ్ డైరెక్టర్ మన్సూర్ ఖాన్ బ్యాంకు ఖాతాల్లోని మొత్తం రూ.209 కోట్లను జప్తు చేసింది. ఈ ఆర్థిక మోసంలో సంబంధం ఉన్నట్ట భావిస్తున్న కర్ణాటక ఆహార, సివిల్ సరఫరాల మంత్రి బీ జడ్ జమీర్ అహ్మద్ ఖాన్ కు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆయనకు పరారీలో ఉన్న ఐఎంఏ వ్యవస్థాపకుడు మొహమ్మద్ మన్సూర్ ఖాన్ నుంచి నిధులు వచ్చాయని ఆరోపణ ఉంది. జూలై 5న దర్యాప్తు సంస్థ ఎదుట హాజరు కావాలని సూచించింది. మంత్రికి నోటీసు అందజేసేందుకు ఈడీ అధికారులు గంటల తరబడి ఆయన నివాసం బయట ఎదురుచూశారు.


మన్సూర్ ఖాన్ పై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే పనిలో ఈడీ ఉన్నట్టు అధికారిక వర్గాలు చెప్పాయి. అలాగే ఆయనపై పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద చర్యలు తీసుకొనే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ కేసులో ఐఎంఏకి చెందిన ఏడుగురు పెట్టుబడిదారులను పోలీసులు ఇంతకు ముందే అరెస్ట్ చేశారు. ఈద్ తర్వాత నుంచే మన్సూర్ ఖాన్ పరారీలో ఉన్నాడు. కొంత కాలంగా పోలీసులు అతని కోసం వెదుకుతున్నారు. తన పెట్టుబడిదారులకు గత మూడు నెలలుగా వడ్డీ చెల్లించడం లేదని ఐఎంఏపై ఆరోపణ.


అధిక వడ్డీ ఆశ చూపించి మన్సూర్ ఖాన్ వేలాది మంది ప్రజలతో కంపెనీలో పెట్టుబడులు పెట్టించాడు. పెట్టుబడి పెట్టినవారిలో ఎక్కువ మంది ముస్లింలే. దాదాపు రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు ఇప్పటి వరకు తేలింది. ఇందులో రూ.200 కోట్లు కేవలం ముస్లిం మహిళలే పెట్టుబడి పెట్టారు. ఐఎంఏపై ఇప్పటి వరకు 38,000 మంది పెట్టుబడిదారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వం కూడా దర్యాప్తు జరుపుతోంది. ఇందుకోసం 11 మంది సభ్యుల సిట్ ను ఏర్పాటు చేసింది. ఐఎంఏ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్ట్ లో 18 పిటిషన్లు దాఖలయ్యాయి. కంపెనీలో పెట్టుబడి పెట్టినవాళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల వాళ్లు అధిక సంఖ్యలో ఉన్నారు.