సైకిలెక్కిన మాజీ మంత్రి అహ్మదుల్లా!!

సైకిలెక్కిన మాజీ మంత్రి అహ్మదుల్లా!!
ahmedullah in tdp

అమరావతి:

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా, ఆయన కుమారుడు అష్రఫ్‌, పలువురు ముస్లిం నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నాయకుడు రాజశేఖర్‌ కూడా తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. చంద్రబాబు పాలనాదక్షుడని, ఆయన చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై పార్టీలో చేరామని అహ్మదుల్లా, రాజశేఖర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, ఎమ్మెల్సీలు టీడీ జనార్దన్‌, బీటెక్‌ రవి, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఏవీ రమణ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా రాజకీయాల్లో హాజీ మహమ్మద్‌ అహ్మదుల్లాకు ఓ గుర్తింపు ఉంది. తండ్రి రహంతుల్లాకు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. కడప మున్సిపల్‌ చైర్మన్‌గా ఒకసారి, రెండుసార్లు ఎమ్మెల్యేగా, వైఎస్‌, రోశయ్య, కిరణ్‌ కేబినెట్‌లలో మైనారిటీ సంక్షేమం, చక్కెర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకున్నా కాంగ్రె్‌సలోనే కొనసాగుతూ వచ్చారు. ఆయన తండ్రి మహమ్మద్‌ రహంతుల్లా.. నాటి జలగం వెంగళరావు, నీలం సంజీవరెడ్డి వంటి ఉద్దండులతో కలిసి పనిచేశారు. కడప ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. రహంతుల్లా కూడా వైఎస్‌ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా మెలగుతూ మైనింగ్‌ వ్యాపారాలు సైతం వారితో కలిసి చేసేవారు. ఆయన మరణానంతరం అహ్మదుల్లా రాజకీయ ప్రవేశం చేశారు. 2000లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కడప మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైఎ్‌సతో సాన్నిహిత్యం కారణంగా 2004 ఎన్నికల్లో కడప అసెంబ్లీ టికెట్‌ లభించింది. ఆయన గెలుపొందారు. 2009లో కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పుడే వైఎస్‌ కేబినెట్‌లో మైనారిటీ సంక్షేమ మంత్రి అయ్యారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లోనూ 2014 వరకు కొనసాగారు. 1996లో కడప లోక్‌సభ నుంచి పోటీ చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఐదు వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కడం వెనుక అహ్మదుల్లా నేర్పు, చాతుర్యం ఉన్నాయని ఇప్పటికీ చెప్పుకొంటుంటారు. వైఎస్‌ తన యుడు జగన్‌ సొంత పార్టీ పెట్టినా అహ్మదుల్లా చేరలేదు.