ఏఎన్-32 కోసం ఐఏఎఫ్ వేట సాగుతోందిలా..

గత సోమవారం భారతీయ వాయుసేనకు చెందిన మీడియం-లిఫ్ట్ రవాణా విమానం ఏఎన్-32 అదృశ్యమైంది. అస్సాంలోని జోర్హట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని మెచుకా అడ్వాన్స్ డ్ ల్యాండింగ్ గ్రౌండ్(ఏఎల్జీ)కి బయల్దేరి వెళ్లిన ఈ విమానం మాయమై వారం గడిచిపోయింది. ఐఏఎఫ్, సైన్యం విమానాన్ని కనిపెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. అయినప్పటికీ ఇప్పటికీ విమానం గుర్తించడం కానీ అందులో ప్రయాణిస్తున్న 13 మంది సిబ్బంది, ప్రయాణికులు ఏమయ్యారనే విషయం తెలియరాలేదు.

మాయమైన విమానాన్ని అన్వేషించేందుకు ఐఏఎఫ్ వివిధ రకాల సాధనాలను ఉపయోగిస్తోంది. వీటిలో సీ-130జె విమానం, ఎస్ యు-30ఎంకెఐ విమానం, భారత నౌకాదళానికి చెందిన పీ8ఐ లాంగ్-రేంజ్ నిఘా విమానం, అడ్వాన్స్ డ్ లైట్ హెలికాప్టర్లు(ఏఎల్ హెచ్), ఎంఐ-17 హెలికాప్టర్లు, చీతా హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో పీ8ఐ, ఎస్ యు-30లలో ఏఎన్-32 కూలినట్టు భావిస్తున్న దట్టమైన అటవీ ప్రాంతంలో సైతం గుర్తించగలిగే పవర్ రాడార్లు ఉన్నాయి. పీ8ఐలో సింథటిక్ అపర్చర్ రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ అండ్ ఇన్ఫ్రారెడ్ (ఈవో&ఐఆర్) సెన్సర్లు ఉన్నాయి. విమానం ఉన్న ప్రాంతాన్ని గుర్తించేందుకు ఉపగ్రహ ఛాయాచిత్రాలను కూడా ఉపయోగిస్తున్నారు. కార్టోశాట్, రిశాట్ వంటి ఉపగ్రహలు పలు ప్రాంతాలను ఫోటోలు తీస్తున్నాయి. వీటితో పాటు ఐఏఎఫ్ మానవరహిత విమానాలను (యుఏవీ) రంగంలోకి దించింది. సైన్యం, అస్సాం రైఫిల్స్, అరుణాచల్ పోలీసులు స్థానిక గ్రామస్థుల సాయంతో అడవులను జల్లెడ పడుతున్నారు. ఏఎన్-32 గురించి ఏదైనా సమాచారం చెబితే రూ.5 లక్షల నగదు బహుమతి ప్రకటించింది ఐఏఎఫ్.

ఐఏఎఫ్ ఇంత ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ కూలినట్టు భావిస్తున్న ఆ విమానం జాడ కనిపెట్టలేదు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఇక్కడ అడవులు ఎంత దట్టంగా ఉంటాయంటే ఇవి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో పశ్చిమ బెంగాల్ నుంచి చైనా వెళ్తున్న విమానాన్ని మింగేశాయి. ఇప్పటికీ వాటి శిథిలాలు తరచుగా బయటపడుతూ ఉన్నాయి. ఇక వాతావరణం కూడా సహకరించడం లేదు. తరచుగా కురుస్తున్న వానలు, దట్టంగా అలముకున్న మేఘాల కారణంగా అన్వేషణ ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడుతోంది. అన్వేషణ, సహాయక బృందాలు విమానాల ద్వారా జల్లెడ పడదామంటే ప్రతికూల వాతావరణం అడ్డుపడుతోంది. రాత్రి వేళల్లో రాడార్ల ద్వారా విమానాన్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవేవీ ఫలితాన్నివ్వలేదు.