పది పరీక్షల్లో కొడుకు ఫెయిలైతే పార్టీ!!


అవును.. పదో తరగతి పరీక్షల్లో నాలుగు సబ్జెక్టుల్లో కొడుకు ఫెయిలైనందుకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడో తండ్రి. బాణాసంచా కాల్చడం, ఊరేగింపులు, డీజేలు, ఘనంగా విందు వినోదాలు..ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ పట్టణంలో జరిగింది. సాగర్ పట్టణంలో సివిల్ కాంట్రాక్టర్ అయిన సురేంద్ర కుమార్ వ్యాస్ పరీక్షల్లో ఫెయిలైన కొడుకు మానసికంగా కుంగిపోకూడదని ఇలా అదిరిపోయే రేంజ్ లో ఫెయిల్యూర్ పార్టీ ఇచ్చాడు.

ఇరుగుపొరుగు వారు, బంధుమిత్రులు, పెద్ద సంఖ్యలో అతిథులను ఈ పార్టీకి ఆహ్వానించారు. సంగీతం, డాన్సుల కోసం డీజే..కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా పేల్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ తన కొడుకును ఉత్సాహపరించేందుకే ఇలా చేసినట్టు వ్యాస్ చెప్పాడు. పరీక్షల్లో ఫెయిలైతే పిల్లలు కుంగిపోవడం, డిప్రెషన్ లోకి జారడం, కొందరైతే ఆత్మహత్యలు కూడా చేసుకోవాలనే తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పిల్లలందరికీ బోర్డ్ ఎగ్జామ్స్ జీవితంలో చివరి పరీక్షలు కాదని, జీవితంలో ఇంకెంతో చూడాల్సింది ఉందని చాటిచెప్పేందుకు ఇలా పార్టీ ఇచ్చినట్టు వివరించారు. ఇప్పుడు పరీక్షల్లో ఫెయిలైన తన కుమారుడు వచ్చే ఏడాది మరోసారి ఆ పేపర్లు రాసే అవకాశం ఉందని తెలిపారు.

తండ్రి తనను ఉత్సాహపరచి ప్రోత్సహించేందుకు ఎంచుకున్న విధానం చూసి వ్యాస్ కుమారుడు ఆశు ఉద్వేగభరితుడయ్యాడు. తన తండ్రిని ఆకాశానికి ఎత్తేశాడు. వచ్చే ఏడాది పరీక్షల్లో అత్యంత సునాయాసంగా అత్యుత్తమ గ్రేడ్లతో పాసయ్యేందుకు విపరీతంగా కష్టపడి చదువుతానని చెప్పాడు. మార్కుల మార్కెట్లు, ర్యాంకుల రేసులకు ప్రాణాలు పణంగా పెడుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సురేంద్ర కుమార్ వ్యాస్ తన ఈ చర్యతో చక్కటి సందేశాన్ని ఇచ్చారు.

Father Throws Party After Son Failed 10th Grade Exam

India, National, 10th Class Exam, Board Examinations,Children, Failed, Madhya Pradesh, Parents, Party, Sagar, Surendra Kumar Vyas