కోర్టులో యుపి బార్ కౌన్సిల్ అధ్యక్షురాలి హత్య!!

ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ అధ్యక్షురాలు దర్వేష్ యాదవ్ ను కాల్చి చంపారు. న్యూ ఆగ్రాలోని ఆగ్రా జిల్లా కోర్టు పరిసరాల్లో మరో అడ్వకేట్ ఆమెపై వరుసగా మూడుసార్లు కాల్పులు జరిపాడు. ఆ వెంటనే హంతకుడు తనను తాను కాల్చుకున్నాడు. అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఆగ్రాకి చెందిన అడ్వకేట్ దర్వేష్ యాదవ్ యుపి బార్ కౌన్సిల్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. రెండు రోజుల క్రితమే ఆమె బాధ్యతలు చేపట్టారు. ఇవాళ కోర్టులో స్వాగత కార్యక్రమానికి ఆమె హాజరవుతుండగా ఈ సంఘటన జరిగింది.

దర్వేష్ యాదవ్ సీనియర్ అడ్వకేట్ అరవింద్ కుమార్ మిశ్రా చాంబర్ లో కూర్చొని ఉన్నారు. అడ్వకేట్ మనీష్ శర్మ యుపి బార్ కౌన్సిల్ అధ్యక్షురాలు దర్వేష్ యాదవ్ దగ్గరకు వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ వెంటనే ఒకటి తర్వాత ఒకటిగా మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో దర్వేష్ అక్కడికక్కడే కుప్పకూలారు. ఆ తర్వాత అడ్వకేట్ మనీష్ శర్మ కూడా తనను తాను కాల్చుకున్నాడు.

దర్వేష్ యాదవ్ ను తీవ్ర పరిస్థితుల్లో పుష్పాంజలి హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్లు మరణించినట్టు ప్రకటించారు. అదే ఆస్పత్రిలో నిందితుడైన అడ్వకేట్ మనీష్ శర్మను కూడా చేర్చారు.