పాక్ మాజీ అధ్యక్షుడు జర్దారీ అరెస్ట్!!

నకిలీ బ్యాంకు ఖాతాలు, మనీ లాండరింగ్ కేసుల్లో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని ఆ దేశ జాతీయ జవాబుదారీ బ్యూరో అరెస్ట్ చేసింది. జర్దారీ బెయిల్ అర్జీని కోర్టు తిరస్కరించిన వెంటనే 15 మంది సభ్యుల ఎన్ఏబీ బృందం, పోలీస్ సిబ్బంది ఇస్లామాబాద్ లోని జర్దారీ నివాసంలో ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది నాలుగున్నర బిలయన్ల పాకిస్థానీ రూపాయల కుంభకోణమని చెబుతున్నారు. మంగళవారం జర్దారీని కోర్టు ఎదుట హాజరు పరుస్తారు. ఇప్పటి వరకు ఆయన తాత్కాలిక బెయిల్ పై ఉన్నారు.


మే నెలలో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి ఆరు అవినీతి కేసుల్లో ఇస్లామాబాద్ హైకోర్ట్ తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. పాకిస్థాన్ అవినీతి దర్యాప్తు సంస్థ ఈ కేసులపై విచారణ జరుపుతోంది. పాకిస్థాన్ జాతీయ జవాబుదారీ బ్యూరో (ఎన్ఏబీ) తరఫున మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టిన 11 పేజీల నివేదిక ప్రకారం 36 దర్యాప్తు కేసుల్లో 63 ఏళ్ల మాజీ అధ్యక్షుడి పేరు ఉంది. వీటిలో కనీసం 8 కేసుల్లో జర్దారీ పాత్ర రుజువైనట్టు ఎన్ఏబీ చెబుతోంది.

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కోచైర్మన్ అయిన జర్దారీ 2008-2013 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన భార్య, మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో డిసెంబర్ 2007లో హత్యకు గురైన తర్వాత ఆయన పీపీపీ బాధ్యతలు చేపట్టారు.