నిద్ర, ఒత్తిడిని చెప్పే గెలాక్సీ వాచ్.

న్యూఢిల్లీ:

స్మార్ట్ ఫోన్ల తయారీలో దిగ్గజ సంస్థ శాంసంగ్ ఇండియా భారత మార్కెట్లోకి తన ‘గెలాక్సీ వాచ్’ని ప్రవేశపెట్టింది. ఒత్తిడి, నిద్ర వంటి జీవనశైలికి సంబంధించిన అనేక కీలక అంశాలను ఎప్పటికప్పుడు తెలియజెప్పడం ఈ వాచ్ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. ఈ కొత్త గెలాక్సీ వాచ్ రెండు వేరియంట్లలో ప్రవేశపెడుతున్నట్టు శాంసంగ్ తెలిపింది. దీని 46మి.మీల వర్షన్ ధర రూ.29,990, 42మి.మీల వర్షన్ వెల రూ.24,990గా శాంసంగ్ నిర్ణయించింది.ఈ వాచ్ శాంసంగ్ ట్రేడ్ మార్క్ సర్కులర్, తిప్పుకొనే వీలున్న బేజల్ యూజర్ ఇంటర్ ఫేస్, అనలాగ్ వాచ్ ఫేస్, ఆల్వేస్ ఆన్ డిస్ ప్లే లెన్స్ తో ఉంటుంది. ఇందులో ఎగ్జినోస్ 9110 డ్యూయల్ కోల్ 1.15 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్ అమర్చారు. దీని బ్యాటరీ బ్యాకప్ కూడా సుదీర్ఘ కాలం రానుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే చాలా రోజుల వరకు నడుస్తుంది. త్వరలోనే గెలాక్సీ వాచ్ ఒక అద్భుతమైన ఫ్యాషన్ యాక్సెసరీగా గుర్తింపు పొందుతుందని శాంసంగ్ ఇండియా ధీమా వ్యక్తం చేసింది. గెలాక్సీ వాచ్ లో కాలింగ్, మెయిలింగ్, నోటిఫికేషన్స్, యాక్టివిటీస్ వంటి సౌకర్యాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. దీని అమ్మకాలు అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయి. సిల్వర్, మిడ్ నైట్ బ్లాక్, గోల్డ్ రంగుల్లో ఈ గెలాక్సీ వాచ్ లభ్యం కానుంది.