త్రిపురలో 96 మంది క్రిస్టియన్ల ‘ఘర్ వాపసీ’

త్రిపురలో 96 మంది క్రిస్టియన్ల ‘ఘర్ వాపసీ’

Ghar wapsi tripura

ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఆదివారం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన హిందూ జాగరణ్ మంచ్, విశ్వ హిందూ పరిషద్ (వీహెచ్ పీ) కలిసి 96 మంది క్రిస్టియన్లను హిందూ మతంలోకి మార్చారు. ఉనాకోటి జిల్లాలోని కైలాషహర్ లో ఈ ఘర్ వాపసీ కార్యక్రమం జరిగింది. గతంలో హిందూవులుగా ఉండి క్రిస్టియానిటీలోకి వెళ్లినవారిని తిరిగి వారి అసలైన మతంలోకి మార్చినట్టు హిందూ జాగరణ్ మంచ్ నేత మఖన్ లాల్ నాథ్ తెలిపారు.

‘వాళ్లు జన్మత: హిందువులు. తొమ్మిదేళ్ల క్రితం రాచిపాడ ప్రాంతంలో 23 కుటుంబాలకు చెందిన 98 మందిని క్రిస్టియానిటీలోకి మార్చారు. వాళ్లు తిరిగి హిందూ మతం పుచ్చుకోవాలని కోరుకున్నారు. వారిని తిరిగి హిందూ మతంలోకి మార్చేందుకు యజ్ఞం నిర్వహించడం జరిగింది. ఆ విధంగా గౌరవప్రదంగా వారి కోరికను నెరవేర్చాం’ అని నాథ్ చెప్పారు. మతం మార్చుకొన్నవారిలో చాలా మంది జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలలోని ఒరావో, ముండా గిరిజన తెగలకు చెందినవారని తెలిపారు. వారిని సోనాముఖి టీ ఎస్టేట్ లో పనిచేసేందుకు ఇక్కడికి తీసుకొచ్చారని వివరించారు.

‘ఘర్ వాపసీ’ లేదా తన సొంత మతంలోకి వచ్చేందుకు ఈ మతమార్పిడి యజ్ఞం నిర్వహించినట్టు వీహెచ్ పీ ఉనాకోటి జిల్లా సెక్రటరీ మదన్ మోహన్ గోస్వామి తెలిపారు. క్రిస్టియానిటీలోకి మారేందుకు తమను ప్రలోభపెట్టారని ఘర్ వాపసీ చేసిన బిర్సా ముండా చెప్పారు. ‘పల్లెల్లో నిరుపేదలుగా ఉన్న మమ్మల్ని క్రిస్టియన్లు ప్రలోభాలకు గురిచేసి మతం మార్చారు. మాతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. తరచుగా వారు మాతో దుర్మార్గంగా ప్రవర్తించడంతో మేం విసిగిపోయాం. ఇవాళ ఈ యజ్ఞం ద్వారా తిరిగి మా ఇష్టం కొద్దీ హిందూ మతంలోకి మారామని’ తెలిపారు.