మనోహర్ పారికర్ మరణించారు: కాంగ్రెస్.

న్యూఢిల్లీ:
అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణించి ఉంటారని కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. ఆయన గైర్హాజరీలో సీఎం చుట్టూ ఉండే కొందరు అధికారుల కోటరీ అక్రమంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించింది. ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి అక్టోబర్ 14న తిరిగి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి పారికర్ ఎక్కడా కనిపించకపోవడంపై సందేహాలు కలుగుతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జితేంద్ర దేశ్ ప్రభు అన్నారు. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండించింది.అక్టోబర్ 27న గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణె మొదటిసారిగా పారికర్ క్లోమ కేన్సర్ తో బాధపడుతున్నారని అధికారికంగా ప్రకటించారు. అయితే పారికర్ బుధవారం తన నివాసంలోనే కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీజేపీ, బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పారికర్ సజీవంగా ఉన్నారని గోవా ప్రజలకు రుజువు చేయాలని దేశ్ ప్రభు డిమాండ్ చేశారు.రాజకీయ విలువలు పతనమైన కాంగ్రెస్ పార్టీలోని అసహనానికి ఈ వ్యాఖ్యలు సూచన అని బీజేపీ విమర్శించింది. ఎయిమ్స్ ను డిశ్చార్జి అయి రాష్ట్రానికి తిరిగి వచ్చాక పారికర్ తన నివాసంలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంటిలోనే అత్యాధునిక వైద్య సేవలను ఏర్పాటు చేశారు. 24 గంటలు డాక్టర్లు, ఇతర సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.