హిందీలో మాట్లాడనున్న గూగుల్ హోమ్!!

Google HIndi

న్యూఢిల్లీ:

టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ భారతీయులకు మరింత చేరువయ్యేందుకు మరో అడుగు ముందుకేసింది. త‌న గూగుల్ హోమ్ లోని గూగుల్ అసిస్టెంట్‌కు హిందీ భాష స‌పోర్ట్‌ను అందిస్తోంది. ఈ ఫీచర్ తో మీరు స్పీకర్ తో హిందీలో మాట్లాడవచ్చు. ఇవాళ్టి నుంచే ఈ ఫీచ‌ర్ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. గూగుల్ హోంలో ఉండే గూగుల్ అసిస్టెంట్ ఇక‌పై వినియోగ‌దారులు హిందీలో అడిగే ప్రశ్నల‌కు కూడా స‌మాధానం ఇస్తుంది. ఈ ఫీచ‌ర్ ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంది. ఇప్పుడు గూగుల్ హోం స్మార్ట్ స్పీక‌ర్లలోనూ అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ఈ అప్ డేట్ గురించి ఇవాళ ప్రకటించింది కానీ స్పీకర్లలో ఈ అప్ డేట్ వారం క్రితమే ప్రారంభమైంది.ఈ ఫీచర్ ను మీ స్పీకర్లలో యాక్టివేట్ చేయాలంటే మీరు ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ హోమ్ యాప్ ని తెరవాలి. ఆ తర్వాత కుడివైపు కింద ఉన్న అకౌంట్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే సెట్టింగ్ ఆప్షన్ వస్తుంది. సెట్టింగ్ లలోకి వెళ్లి అసిస్టెంట్ ట్యాబ్ లో లాంగ్వేజ్ దగ్గర మొదట యాక్టివేట్ అయిన ఇంగ్లీష్ ని హిందీకి మార్చాలి. దీంతో గూగుల్ హోమ్ స్పీకర్ల ప్రైమరీ భాష హిందీ అవుతుంది. అనంత‌రం ఓకే గూగుల్ అని యూజ‌ర్లు సంభాషణ ప్రారంభించ‌వ‌చ్చు. అయితే మీరు ఒకేసారి రెండు భాషలలో హోమ్ తో సంభాషించలేరు. అందువల్ల మీరు యాడ్ ఎ లాంగ్వేజ్ కింద హిందీని సెకండరీ భాషగా ఉపయోగించవచ్చు.ఈ ఫీచర్ తో యూజర్లు తమకు ఇష్టమైన పాటలు వినవచ్చు. ప్రశ్నలకు సమాధానం కనుగొనవచ్చు. స్మార్ట్ హోం డివైస్‌ల‌ను కంట్రోల్ చేయ‌మ‌ని, షాపింగ్‌, ఇత‌ర స‌మాచారం వెద‌క‌మ‌ని యూజ‌ర్లు గూగుల్ హోంకు ఆదేశాలు ఇవ్వొచ్చు. అలారం కూడా సెట్ చేసుకోవ‌చ్చు. వాతావ‌ర‌ణం, కాంటాక్ట్స్ వివ‌రాల‌ను కూడా వెద‌క‌వ‌చ్చు.