యుపీలో పార్టీలకు ‘దేవుడే’దిక్కు!!

సూరపనేని.జే.

వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్ లోని ప్రధాన పార్టీలన్నీ దేవుడా నీవే దిక్కంటున్నాయి. ఎప్పటిలాగే బీజేపీ రాముడిని నమ్ముకుంటే సమాజ్ వాదీ పార్టీ విష్ణువుని ఎంచుకుంది. శివుడు తమ తలరాతని మార్చేస్తాడని కాంగ్రెస్ భావిస్తోంది. ఎందుకంటే పార్టీల ప్రధాన నేతలంతా ఆయా దేవుళ్లని తెగ దర్శించేస్తున్నారు. ఇటీవలే మానస సరోవర యాత్ర ముగించుకొని తన సొంత నియోజకవర్గం అమేథీకి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి.. శివభక్తులు కావడియాల వస్త్రధారణలో ఎదురొచ్చిన వందలాది మంది కార్యకర్తలు బోల్ బమ్ నినాదాలతో స్వాగతం పలికారు. నగరంలో ఎక్కడ చూసినా శివభక్త రాహుల్ గాంధీ పోస్టర్లు, ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. రాహుల్ పర్యటన ఫోటోలు పరిశీలిస్తే నుదుట చందనం రాసుకొని దానిపై ఎర్రని తిలకం పెట్టుకొని కనిపించారు. మెడలో కాషాయ కండువాతో పూజలు జరిపారు. ఇక ఫుర్సత్ గంజ్ లో శివభక్తులు రాహుల్ కి శివుని చిత్రపటాన్ని బహూకరించారు. ఏప్రిల్ నెలలో కర్ణాటక ఎన్నికల ప్రచారం చేస్తున్న రాహుల్ తృటిలో విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రాణాపాయం తప్పినందుకు కృతజ్ఞతగా శివుని దర్శనం చేసుకున్నానని రాహుల్ ప్రకటించారు. హిందూ ఓటర్లని ఆకట్టుకొనేందుకు కాంగ్రెస్ చేస్తున్న ఎన్నికల స్టంట్ గా ప్రత్యర్థి పార్టీలు కొట్టి పారేస్తున్నాయి. ఇక అయోధ్యలోని వివాదాస్పద ప్రదేశంలో రామ మందిరం నిర్మించి తీరతామని బీజేపీ యుపీ చీఫ్ మహేంద్రనాథ్ పాండే మరోసారి చెప్పారు. అయోధ్యలో రాముడు జన్మించినందువల్ల ప్రజలు అక్కడ రామ మందిరం కోరుకుంటున్నారన్నారు. రామ మందిరం హిందువుల భక్తివిశ్వాసాలకు ప్రతీకని, తాము జనామోదంతో అయోధ్యలో మందిరం నిర్మించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రతి భారతీయుని మనోభావమే బీజేపీ మనోగతమని చెప్పారు. న్యాయబద్ధంగా మందిర నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్టు పాండే స్పష్టం చేశారు. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తాము అధికారంలోకి వస్తే మహావిష్ణువు పేరిట భారీ నగరాన్నే నిర్మిస్తామని ప్రకటించారు. ఇటావాలోని లయన్ సఫారీ దగ్గర 2,000 ఎకరాల్లో కొత్త నగర నిర్మాణం జరుపుతామని చెప్పారు. అందులో కంబోడియాలోని అంకోర్ వాట్ తరహాలో నభూతో అనే తరహాలో భవ్య మందిర నిర్మాణం ఉంటుదని వివరించారు. రాముడు, కృష్ణుడు ఇద్దరు విష్ణువు అవతారాలే అయినందువల్ల తాను విష్ణువు పేరిట నగరాన్ని, అత్యంత భారీ నిర్మాణాన్ని ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు.