హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ సర్కార్ షాక్!

న్యూయార్క్:

అమెరికాలో హెచ్ 1బీ వీసాలపై పని చేస్తున్న వారికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాకివ్వబోతోంది. హెచ్ 1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేసేందుకు అనుమతించే పర్మిట్లను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని నేడు అమెరికా ఫెడరల్ కోర్టుకు తెలిపింది. ఈ అంశంపై మూడు నెలల్లో అధికారిక నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. రద్దు ప్రతిపాదనపై హోంలాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (డిహెచ్ఎస్‌) సీనియర్‌ యంత్రాంగం పరిశీలనలు చేసిందని, పునస్సమీక్ష కోసం అమెరికా పౌర, వలస సేవల సంస్థ (యుఎస్‌సిఐఎస్‌)కు పంపినట్లు డిహెచ్ఎస్‌ తెలిపింది. తాజా పరిణామాలతో హెచ్‌4 వీసాదారులు ఆందోళనకు గురవుతున్నారు.హెచ్ 1బీ వీసాదారులు, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నవారి జీవిత భాగస్వాములు హెచ్4 డిపెండెంట్ వీసాతో ఉద్యోగాలు చేయవచ్చంటూ ఒబామా ప్రభుత్వం 2015లో ప్రకటించింది. ఈ నిర్ణయంతో స్థానికులకు ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయని ఆరోపణలు వచ్చాయి. హెచ్4 వీసాదారులకు వర్క్ పర్మిట్లు ఇచ్చినందువల్ల అమెరికన్లకు ఉద్యోగాలు దొరకడం లేదని ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో హెచ్4 వీసాదారుల వర్క్ పర్మిట్లు రద్దు చేస్తామని ఈ ఏడాది ఫిబ్రవరి 28నే ట్రంప్ సర్కార్ ప్రకటించింది. కొన్ని కారణాల వల్ల దీని అమలు వాయిదా పడింది.హెచ్4 వీసాదారులకు వర్క్ పర్మిట్లు రద్దు చేస్తే భారతీయులే ఎక్కువ నష్టపోనున్నారు. 2017 డిసెంబర్ 25 నాటికి 1,26,853 మంది హెచ్4 వీసాదారులకు వర్క్ పర్మిట్లను అమెరికా మంజూరు చేసింది. వీరిలో 93 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం. 5% మంది చైనీయులు ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వ తాజా నిర్ణయం అమలైతే ఒక్క జీతంతోనే కుటుంబం గడపాల్సి వస్తుంది.