వైరల్ వీడియో: రోటరీ ఫోన్ తో టీనేజర్ల తిప్పలు

వైరల్ వీడియో: రోటరీ ఫోన్ తో టీనేజర్ల తిప్పలు
rotary phone viral video

మీరు చివరిసారిగా రోటరీ డయల్ ఫోన్ ఎప్పుడు చూశారు? ఈ మధ్య కాలంలో అసలు చూసి ఉండరు. పుష్ బటన్ ఫోన్లు వచ్చాక పాత రోటరీ డయల్ మోడల్స్ కాలగర్భంలో కలిసిపోయాయి. ఇదే సంగతి ఇప్పుడు మనం చూడబోయే వీడియో క్లిప్ లో కూడా స్పష్టమవుతుంది. కెవిన్ బంస్టెడ్ అనే వ్యక్తి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా షేర్ అవుతోంది. ఇందులో కెవిన్ 17 ఏళ్ల కొడుకు, మేనల్లుడు రోటరీ ఫోన్ లో ఫోన్ నెంబర్ డయల్ చేయడానికి పడిన తిప్పలు తెగ నవ్వు తెప్పిస్తున్నాయి.

ఇల్లినాయిస్ లో ఉండే కెవిన్ తన కొడుకు జేక్, మేనల్లుడు కైల్ ని రోటరీ ఫోన్ లో ఫోన్ నెంబర్ డయల్ చేయమని సవాల్ విసిరాడు. ఇందుకు నాలుగు నిమిషాల గడువు కూడా ఇచ్చాడు. ‘ఫోన్ చేతిలోకి తీసుకొని డయల్ చేయాలా?’ అని కైల్ అడుగుతున్నాడు. ‘ఈ రంధ్రాలన్నీ దేనికి?’ అనే సందేహాన్ని సైతం వెలిబుచ్చాడు. మీరు కనుక రోటరీ ఫోన్లు వాడుతూ పెరిగినట్టయితే ఈ వీడియో చూస్తే మీకు కావాల్సినంత వినోదం. ఈ వీడియోని చూడండి.

ఆన్ లైన్ లో ఈ వీడియోని షేర్ చేయగానే విపరీతంగా వైరల్ అయింది. ఇప్పటి వరకు 26 మిలియన్లకు పైగా వ్యూస్, 4 లక్షల పైచిలుకు షేర్లు వచ్చాయి. ఇక కామెంట్లయితే 20,000కు పైమాటే. కెవిన్ బంస్టెడ్ యూట్యూబ్ లో ఓ వీడియోని చూసినపుడు ఇప్పటి టీనేజర్లు రోటరీ ఫోన్ ఎలా వాడతారనే ఆలోచన వచ్చినట్టు డెయిలీ మెయిల్ తెలిపింది.