మ్యాచ్‌ ఓడిపోవడంతో ఆటగాళ్లకు గుండ్లు కొట్టించిన కోచ్.

మ్యాచ్‌ ఓడిపోవడంతో
ఆటగాళ్లకు గుండ్లు కొట్టించిన కోచ్.

కోల్‌కతా:

ఏదేనా ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఓడిపోతే కోచ్‌కు కోపం రావడం, కెప్టెన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం సర్వ సాధారణం. క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్ సహా చాలా క్రీడల్లో ఇలాంటి ఘటనలు మనం చూశాం. అయితే, పశ్చిమ బెంగాల్‌లో ఓ హాకీ కోచ్ మాత్రం జట్టు సభ్యులకు వివాదాస్పద శిక్ష విధించాడు. మ్యాచ్ ఓడిపోయినందుకు ఆటగాళ్లందరికీ గుండ్లు కొట్టించాడు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల జబల్‌పూర్ (మధ్యప్రదేశ్)లో హాకీ ఇండియా జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ జరిగింది. ఇందులో భాగంగా జనవరి 16న నమ్‌ధారి జట్టు, బెంగాల్ జట్టు మధ్య హాకీ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్‌లో 1-5 తేడాతో బెంగాల్ అండర్ 19 జట్టు ఓటమి పాలైంది. ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో తమ జట్టు క్వార్టర్ ఫైనల్‌లోనే ఓడిపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బెంగాల్ కోచ్ ఆనంద్ కుమార్ ఆటగాళ్లకు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అందరూ బోడి గుండ్లు కొట్టించుకోవాలని ఆదేశించాడు. కోల్‌కతాలకు తిరిగొచ్చే సరికి అందరూ గుండ్లతోనే కనిపించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దాంతో చేసేదేం లేక ఆటగాళ్లందరూ గుండ్లు కొట్టించుకున్నారు. రెండు రోజుల తర్వాత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆటగాళ్లపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన కోచ్ ను నెటిజన్లు చెడుగుడు ఆడేస్తున్నారు. ఈ వ్యవహారమంతా బెంగాల్ అసోసియేషన్ దృష్టికి వెళ్లడంతో సీరియస్‌గా తీసుకుంది. బెంగాల్ అండర్ 19 హాకీ జట్టు కోచ్‌తో పాటు మేనేజర్‌కు నోటీసులు జారీచేసి వివరణ ఇవ్వాలని ఆదేశించింది