భర్త నాగ్ పూర్, భార్య అమెరికా.. వాట్సాప్ లో విడాకులు

భర్త నాగ్ పూర్, భార్య అమెరికా.. వాట్సాప్ లో విడాకులు
null

వాట్సాప్ లో విడాకులు మంజూరు చేసి నాగ్ పూర్ ఫ్యామిలీ కోర్టు ముక్కున వేలేసుకొనేలా చేసింది. ఈ కేసులో భార్య తన అంగీకారాన్ని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా తెలిపింది. 35 ఏళ్ల భార్య స్టూడెంట్ వీసాపై అమెరికాలోని మిషిగన్ లో చదువుకుంటోంది. తనకు సుదీర్ఘ కాలంపాటు సెలవు ఇవ్వడం లేదని చెబుతూ కోర్టు విచారణకు హాజరు కాలేనని నిస్సహాయత వ్యక్తం చేసింది. అందువల్ల కోర్టు విచారణను వాట్సాప్ వీడియో కాల్ ద్వారా నిర్వహించాలని కోరింది. 37 ఏళ్ల భర్త నాగ్ పూర్ లోని ఖమ్లా నివాసి. అతను మిషిగన్ లో పని చేస్తాడు. కానీ విడాకుల కేసు విచారణ కోసం ఇంటికి వచ్చాడు.

ఇరుపక్షాలు అంగీకరించడంతో నాగ్ పూర్ ఫ్యామిలీ కోర్ట్ న్యాయమూర్తి స్వాతి చౌహాన్ విడాకులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ మహిళకు ఒకేసారి పరిహారం కింద రూ.10 లక్షలు చెల్లించాలని షరతు విధించారు. కోర్టు ఈ ఆదేశాలను 14 జనవరిన ఇచ్చింది. కోర్టు సూచన మేరకు ఫ్యామిలీ కోర్ట్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా భార్య అంగీకారాన్ని నమోదు చేసుకుంది. ఈ జంట 11 ఆగస్ట్ 2013న తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ లో పెళ్లాడారు. ఇద్దరూ అమెరికాలోని ఓ ఆటోమొబైల్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.

భార్య అమెరికా వీసా గడువు ముగియడంతో నాగ్ పూర్ లోని అత్తారింటికి చేరింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడసూపాయి. ఆ తర్వాత ఆమె స్టూడెంట్ వీసాపై తిరిగి మిషిగన్ చేరుకుంది. కాలంతో పాటే వారి అభిప్రాయ భేదాలు పెరిగాయి. భర్త నాగ్ పూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు వేశాడు. కోర్టు చట్టప్రకారం ఈ కేసును ఒక కౌన్సిలర్ కు పంపింది. వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చాల్సిందిగా సూచించింది. కానీ ఇద్దరూ విదేశంలో ఉంటున్నందున కౌన్సిలర్ దగ్గరకు వెళ్లలేకపోయారు. ఎంత ప్రయత్నించినా ఇరుపక్షాల మధ్య అభిప్రాయ భేదాలు సమసిపోక పోవడంతో విడాకులకే మొగ్గు చూపారు.