తప్పుడు ప్రచారంలో భారత్ దే అగ్రస్థానం – డాక్టర్‌ దేవరాజు మహారాజు బయాలజీ ప్రొఫెసర్‌, మెల్బోర్న్‌

”మోడీ గనక మళ్లీ అధికారంలోకి రాకపోతే, దేశమే కాదు బ్రహ్మాండమే వందేండ్లు వెనక్కి వెళుతుంది. దేవీదేవతలు మరణిస్తారు. ప్రజలు విలుప్తమైపోతారు. నదులు ఎండిపోతాయి. సృష్టి వినాశనమైపోతుంది” అని ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా దేశ ప్రజల్ని హెచ్చరించారు. అంతేకాదు మరో అడుగు ముందుకు వెళ్లి ”అబద్ధాలైనా సరే ప్రచారం చేయండి!” అని తన అనుచర గణానికి, తన కనుసన్నల్లో మెదిలే మీడియా-సోషల్‌ మీడియా ప్రతినిధులకు హితవు పలికారు.
”అసలీ మానవుడు ఏకాలంలో బతుకు తున్నట్టూ?”

అని సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. తప్పుడు వార్తల్ని ప్రచారం చేయడానికి బీజేపీకి ఓ ఐటీ సెల్‌ ఉంది. పీఎంఓ – ఇండియా పేజీకి ఓ క్రియేటివ్‌ రైటర్‌ ఉన్నాడు. ఆ అబద్ధపు అడ్డదారి సెల్‌ నుంచి రోజుకు ఒక కోటి మందికి పోస్ట్‌ (మెసేజ్‌)లు వెళుతున్నాయి. వార్తల్ని వక్రీకరించడం, వాటిని వారి పార్టీకి అనుకూలంగా తిప్పి రాయడం చేస్తుంటారు. బీజేపీ ఐటీసెల్‌ నుంచి ‘నమో’ పేజీ ఎడిటర్‌కి సమాచారం వెళుతుంది. బాలాకోట్‌ ఎయిర్‌స్ట్రెక్‌ జరిగినప్పుడు 200 మృతదేహాలున్న వీడియో ‘నమో’ పేజీలో పెట్టారు. కానీ, అది పాతది. బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రెక్‌కు దానికీ సంబంధం లేదు. అలాగే కేరళ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్‌లో ఏబీవీపీ భారీ మెజార్టీతో గెలిచిందని పోస్ట్‌ పెట్టారు. అదీ పూర్తిగా అబద్ధం. ఇలాంటి అబద్ధాలు, అర్థసత్యాలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి.

తప్పుడు ప్రచారంలో మనదేశానిదే అగ్రస్థానమని ప్రపంచ మీడియా సంస్థలు గుర్తించాయి. ఉదాహరణకు ఫేస్‌బుక్‌లో మోడీ, ట్రంప్‌ను మించిపోయారు. ఇది బహిరంగ రహస్యమే. ఎందుకంటే మోడీ ఆత్మీయ మిత్రులయిన అంబానీ, ఆదానీల ఆధీనంలోనే ఎక్కువ న్యూస్‌ ఛానల్స్‌ ఉన్నాయి. ముఖేష్‌ అంబానీ ఆధీనంలో 27 ఛానళ్లు, ఆదానీ ఆధీనంలో 11 న్యూస్‌ ఛానళ్లు ఉన్నాయి. ఇక ”ఫేక్‌ న్యూస్‌” కాక యుధార్థాలు, వాస్తవాలు జనంలోకి పోనిస్తారా?

”అల్పుడెన్ని పల్కులలయక పల్కిన
నధికు డూరకుండు నదిరిపడక
చెట్టు మీద కాకి రెట్టవేసినయట్లు
విశ్వదాభిరామ వినురవేమ”

అని సామాన్యులంతా వేమన పద్యాల సారాంశాన్ని గుర్తుచేసుకోవాల్సి వస్తోంది. అందుకే ఆయన మరోచోట

”ఎంత చదువు చదివి యెన్ని నేర్చిన గాని
హీనుడవ గుణంబు మానలేడు
బొగ్గు, పాలగడుగ బోవునా మలినంబు
విశ్వదాభిరామ వినురవేమ!”
అని కూడా అన్నాడు. తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అధికారం వెలగబెట్టే నేటి ప్రభుత్వాల గురించి ప్రజాకవి వేమన అప్పుడెప్పుడో ఎలా చెప్పగలిగాడూ?భావ స్వాతంత్య్రాన్ని అణచివేస్తూ, వ్యక్తి స్వేచ్ఛను హరిస్తూ, వరుసగా హేతువాదుల్ని, రచయితల్ని చంపిస్తూ, విప్లవకారుల్ని, వామపక్ష కార్యకర్తల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి పైశాచికానందం పొందుతున్న నేటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఎంతో మంది మేధావులు, సినీ, నాటకరంగ కళాకారులు 616 మంది పిలుపునిచ్చారు.
సంజరు హెగ్డే అనే న్యాయవాది మాటల్లో చెప్పాలంటే..
‘గడచిన ఐదేండ్లలో చేసిన పాపాలు ఏమిటంటే.. మేధోపరమైన ఆలోచనను పలుచన చేయడం,
విద్యను ప్రశ్నార్థకంగా మిగల్చేయడం,
విశ్వాసాల ఆధారంగా ఆమోదాలు తెలపడం,
పెద్దగా నోరు చేసుకుని అసత్యాలను,
వీలయినంతగా ప్రచారం చేయడం,
హేతుబద్ధత నుంచి ప్రజలను మళ్లించడం.” హెగ్డే చెప్పింది నిజమే అయినా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హేతువాదుల సంఖ్య పెరుగుతోంది.
జనం వాస్తవాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఉదాహరణకు బాలీవుడ్‌ దర్శకురాలు ఫరాఖాన్‌ అభిప్రాయం చూడండి.. ”నాకు మోడీ అంటే అయిష్టత లేదు. అతని రాజకీయాలు నచ్చవు. నాకు బీజేపీ అంటే అయిష్టత లేదు. ఆ పార్టీ ఆలోచనా ధోరణి నచ్చదు. హిందుమతమంటే అయిష్టత లేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం నచ్చదు. ఇస్లాం అంటే అయిష్టత లేదు. మతం ముసుగులో మారణహోమం నచ్చదు. నాకు ఏ ఒక్కరిపై అయిష్టత లేదు. సమానత్వం పాటించని వారు మాత్రమే నచ్చరు. నాకు ఐకమత్యం కావాలి. సమానత్వం కావాలి. ఒక్క తాటిపై నడిచే దేశం కావాలి” కొద్దిమాటల్లోనే మత రాజకీయాల గురించి, దేశ భక్తి గురించి మానవవాదం గురించి చాలా చెప్పగలిగారావిడ.ఢిల్లీ జేఎన్‌యూ ఏబీవీపీ విద్యార్థులకు అనూహ్యంగా జ్ఞానోదయమైంది. ఆరో వేదంగా ఆరెస్సెస్‌ భావించే మనుస్మృతి ప్రతిని తగులబెట్టారు. అంతేకాదు, మనువాదం, బ్రాహ్మణవాదం నశించాలంటూ నినాదాలు చేశారు. ఇంతకీ వీళ్లకేమైందని సహచర విద్యార్థులు అవాక్కయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులను ఆకట్టుకునే కార్యక్రమం చేయాలని భావించి ఆ పని చేశారు. మనుస్మృతిలో సుమారు 40సార్లు మహిళల్ని కించపరిచారని జేఎన్‌యూ ఏబీవీపీ ఉపాధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

మనుస్మృతి 2-213 / 2-214లలో

మగాళ్లను లొంగదీసుకోవడమే మహిళల స్వభావమని, అవివేకులే కాదు, విజ్ఞులు కూడా ఆడవాళ్ల ఉచ్చులో చిక్కుకుంటారని, వాంఛకు బానిసలైపోతారని.. మనువు రాశాడని ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్ని, దళితుల్ని కించపరచడాన్ని నిరసించారు. ఇంతకూ ఇంత నాటకం ఎందుకంటే, ఇది బీజేపీ కుట్రలో మరో భాగం. వామపక్ష వాదుల్ని, స్త్రీ వాదుల్ని దెబ్బతీయడానికి ఇదొక ఎత్తుగడ.అందుకే వామపక్ష విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌ అంటాడు.. ”లేనిది ఉన్నట్టు చూపించే కనికట్టు మాయాజాలంలో దేశ ప్రజల్ని బురిడీ కొట్టించే విద్యలో మోడీజీ సిద్ధహస్తులు..” అని! ”మోడీ పేదల పక్షపాతి. ఇద్దరు నిరుపేదల కడుపు నింపడం కోసం 130 కోట్ల మంది బతుకులు వీధిన పడేశారు. ముఖేష్‌ అంబానీకి జియో. అనిల్‌ అంబానీకి రాఫెల్‌ పంచిపెట్టి మహానేతగా ఎదిగిపోయారు.”జవాన్ల మీద దాడి జరగబోతోందని ఒక అంతర్జాతీయ నిఘా సంస్థ ప్రకటించినా మోడీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదూ? జవాన్ల శవాలమీద రాజకీయం చేద్దామని ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారా? కుంభమేళాకు వచ్చిన నాగసాధువులు, అఘోరాలంతా ఏమైపోయారూ? వారు తమ నానో టెక్నాలజీని ఉపయోగించి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టొచ్చుకదా? హోమాలు, యజ్ఞాలు, పుష్పక విమానాలు, బ్రహ్మస్త్రాలపై మహోపన్యాలు చేసే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఉపేక్షిస్తున్నారూ? వాటితో ఉగ్రవాదుల్ని ఖతం చేయొచ్చుకదా? ఎందుకా పని చేయడం లేదని సామాన్య ప్రజలు విస్తుపోతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో పుట్టిన పిల్లలకు ఉచితంగా జాతకం చెప్పించడానికి మూడువేల మంది జ్యోతిష్యులకు ఉద్యోగాలు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌ ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో అఖిల భారతీయ సంత్‌ సమితి అధిపతి జగద్గురు హంసదేవా చార్య రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. గవర్నరు, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌, బీజేపీ అధ్యక్షుడు సంతాపం తెలియజేశారు. అసలు ఆయన జగద్గురువు కదా? ఆయనకు రోడ్డు ప్రమాదేమిటీ? వారు మామూలు మనుషులు కాదు గదా? వారికి మరణమేమిటీ? వారి తపశ్శక్తి వల్ల మరణాన్ని జయించాలి కదా? ఇది ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్‌ రాంపూర్‌లో యోగి ప్రభుత్వం ఉరుదూ గేట్‌ను పడగొట్టింది.ముస్లింల మీద వారి సంస్కృతి మీద దాడులు పెరిగాయి. యోగులు, జోగులు అని పేర్లు పెట్టుకోవడం తప్పిస్తే రాగద్వేషాలను అధిగమించిందెక్కడీ మానవత్వమున్న మనుషులుగా ఎదిగిందెక్కడీ ముందు మామూలు మనుషులు కండిరా బాబూ!

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అసోం, మేఘాలయా, మణిపూర్‌ ప్రజలు కొన్ని నెలలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. నల్లజెండాలతో తమ నిరసన తెలియజేశారు. మణిపూర్‌ సినీదర్శకుడు అరిబమ్‌ శ్యాంశర్మ తను స్వీకరించిన ‘పద్మశ్రీ’ని సిటిజన్‌షిప్‌ బిల్లుకు నిరసనగా వెనక్కి తిరిగి ఇచ్చేశారు. ప్రముఖ అస్సామీ గాయకుడు భూపెన్‌ హజారికాకు ప్రస్తుత భారత ప్రభుత్వం ప్రకటించిన ‘భారతరత్న’ను పౌరసత్వ బిల్లుకు నిరసనగా వెనక్కి ఇచ్చేందుకు ఆయన కుటుంబం నిర్ణయం తీసుకుంది.ఇలాంటి సంఘటనలతో పరువు ప్రతిష్టలు దిగజారిపోయినప్పుడైనా, ప్రభుత్వాలు తమ తప్పులు సరిదిద్దుకోవాలి. ”ఒక వేళ నెహ్రూజీ గనక ఖరగ్‌పూర్‌లో ఐఐటీ ఏర్పాటు చేయకుండా 3 వేల కోట్లు పెట్టి ఒక విగ్రహం ఏర్పాటుచేస్తే, నేనీ రోజు రైళ్ళలో పకోడాలు అమ్ముకుంటూ ఉండేవాణ్ణి!” అని అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. అమెరికన్‌ రాజకీయ సిద్ధాంతకర్త, తత్త్వవేత్త థామస్‌ పైనీ ఇలాంటి ప్రభుత్వాల గురించి ఒక మంచి మాట చెప్పారు.. ”నిజమైన దేశభక్తుడి కర్తవ్యమేమంటే.. తన దేశాన్ని ప్రభుత్వం బారిన పడకుండా కాపాడుకోగలగడం!” దేశ ప్రజలందరూ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం అది.