అమెరికాలో వెలుగు చూసిన హెల్త్ కేర్ కుంభకోణంలో నిందితుడై భారతీయ మూలాలు కలిగిన డాక్టర్ కి రూ.50 కోట్ల (70 లక్షల డాలర్లు) పూచీకత్తుపై బెయిల్ లభించింది.

null

అమెరికాలో వెలుగు చూసిన హెల్త్ కేర్ కుంభకోణంలో నిందితుడై భారతీయ మూలాలు కలిగిన డాక్టర్ కి రూ.50 కోట్ల (70 లక్షల డాలర్లు) పూచీకత్తుపై బెయిల్ లభించింది. రూ.3,300 కోట్ల (46.4 కోట్ల డాలర్లు) హెల్త్ కేర్ కుంభకోణంలో 77 ఏళ్ల డాక్టర్ రాజేంద్ర బోథ్రా ముఖ్య నిందితుడు. బోథ్రాతో పాటు ఐదుగురు డాక్టర్లను కూడా నిందితులుగా పేర్కొన్నారు. బోథ్రా నెల రోజులుగా జైల్లో ఉన్నారు. వీరందరిపై డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారని, మోసం చేశారని, రోగులకు అనవసరంగా ఇంజెక్షన్లు ఇచ్చేవారనే ఆరోపణలు ఉన్నాయి. బోథ్రాపై ఆరోపణల విచారణ జూలైలో జరుగుతుంది. ఆయన భార్య, కుమార్తె కూడా తమ పాస్ పోర్టులను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. బోథ్రాకు 1999లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. బోథ్రా అమెరికాలో రిపబ్లికన్ పార్టీ కార్యకర్తగా ఉన్నారు. 1980, 1990లో బోథ్రా అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యు బుష్ కి నిధులు సేకరించడంతో ప్రముఖ పాత్ర పోషించారు.

జీపీఎస్ నిఘా పెడతారు
కుంభకోణం ద్వారా కూడబెట్టిన సొమ్మును ఉపయోగించి బోథ్రా భారత్ పారిపోతారని అమెరికా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. దీంతో ఆయనను గృహనిర్బంధం చేయాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆయనపై జీపీఎస్ నిఘా పెడతారు.

సంపదను జప్తు చేసే అవకాశం
జరిమానా కింద బోథ్రా యావదాస్తిని జప్తు చేసే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. బోథ్రా ఆస్తి వివరాలను ప్రభుత్వ న్యాయవాది సరిగ్గా సమర్పించ లేకపోయారు. కానీ ఆయన ఆస్తి విలువ రూ.249 కోట్లు (3.5 బిలియన్ డాలర్లు) ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బోథ్రాకి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నట్టు తెలిసింది. ఆయన కంపెనీకి 22 ఆస్తులు ఉన్నాయి.

భారత్ లో నిరుపేదలు, రోగులకు సేవ
బోథ్రా భారత్ లో నిరుపేదలు, రోగులకు సేవ చేస్తున్నారు. ప్రతి ఏడాది 8 వారాల పాటు తన ఖర్చుతో భారత్ వచ్చి హెచ్ఐవీ, డ్రగ్స్ పై అవగాహనా శిబిరాలు నిర్వహిస్తారు. పొగాకు, మద్యం వంటి దుర్వ్యసనాలకు బానిసలైన వారిని వాటికి దూరం చేసేందుకు పునరావాస కేంద్రాలు నడుపుతారు. భారత్ లో బోథ్రా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉంటారు. ఇక్కడ ఆయన పలు రంగాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు.