సుమారు 1100 రోజులకు చార్జిషీట్ ఎందుకు గుర్తొచ్చింది?

సుమారు 1100 రోజులకు చార్జిషీట్ ఎందుకు గుర్తొచ్చింది?

JNU Charge Sheet

సాధారణంగా ఢిల్లీ పోలీసులు సీఆర్పీసీలోని సెక్షన్ 173 ప్రకారం అరెస్ట్ చేసిన 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తారు. కానీ రాజద్రోహం నేరం కింద అరెస్ట్ చేసిన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ముగ్గురు విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదైన దాదాపు మూడేళ్లకు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న ఢిల్లీ పోలీసులకు జెఎన్ యు నినాదాల కేసులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఎందుకు గుర్తొచ్చింది? అది కూడా ఢిల్లీ ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా ఆగమేఘాల మీద ఎందుకు నమోదు చేశారు. ఇవాళ ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చినపుడు అందరికీ కలిగిన సందేహాలివి.

సీఆర్పీసీని ఢిల్లీ ప్రభుత్వం నియంత్రిస్తుంది. పోలీసులు చార్జిషీట్ నమోడు చేయాలంటే ప్రభుత్వ అనుమతి పొందడం తప్పనిసరి. కానీ ఢిల్లీ పోలీసులు ఏదో మునిగిపోతున్నట్టు ఐదు రోజుల క్రితం చార్జిషీట్ దాఖలు చేశారు. ఇవాళ కోర్టు ఇదే అంశంపై పోలీసులకు చీవాట్లు పెట్టింది. ఢిల్లీ ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత కానీ ఈ కేసు విచారణ చేపట్టేది లేదని స్పష్టంగా ప్రకటించింది.

ఫిబ్రవరి 9, 2016న జాతి వ్యతిరేక నినాదాలు చేశారని జనవరి 14న ఢిల్లీ పోలీసులు జెఎన్ యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్, విద్యార్థి కార్యకర్తలు ఉమర్ ఖాలిద్, అనిర్బన్ భట్టాచార్య, మరో ఏడుగురిపై 1,200 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. వీరిపై రాజద్రోహంతో పాటు పలు సెక్షన్ కింద అభియోగాలు మోపింది. అయితే ఇప్పుడు ఛార్జిషీట్ దాఖలు చేసిన సందర్భాన్ని అంతా ప్రశ్నిస్తున్నారు. లోక్ సభ సాధారణ ఎన్నికలకు ముందు చార్జిషీట్ దాఖలు చేయడం చూస్తే ఇది రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.