ఉమ్మడి కార్యాచరణ అమలు. రాహుల్ తో కోదండరాం:

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయన నివాసంలో సమావేశం అయ్యారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. మహాకూటమి పొత్తులో భాగంగా టీజేఎస్ తో సర్దుబాటుపై సమావేశంలో చర్చించారు. రాహుల్ గాంధీతో ప్రజా కూటమి ఏర్పాటు, ఆవశ్యకతలపై 40 నిమిషాలపాటు చర్చించానని చెప్పారు కోదండరాం. మీటింగ్ విశేషాలను మీడియాతో చెప్పిన కోదండరాం… తెలంగాణలో నిరంకుశత్వపాలనను అంతమొందించేందుకే ప్రజా కూటమి ఏర్పాటుచేశామన్నారు. కూటమి ఏర్పాటు త్వరగా జరిగేలా చూడాలన్నారు. సీట్ల పంపకాలపై చర్చ జరగలేదన్న కోదండరాం… టీజేఎస్ కు 15 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయసమ్మతంగా సీట్లను సాధించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.
అధికారమే లక్ష్యంగా కూటమి ఏర్పాటు చేయలేదన్న కోదండరాం.. అమరులు కలలు కన్న విధంగా తెలంగాణలో పాలన జరగడం లేదన్నారు. ఉమ్మడి కార్యాచరణని రూపొందించి అమలు చేయాలని రాహుల్ కు సూచించాననీ.. అందుకు రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. సిట్టింగ్ లు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాలను అడగడం లేదన్నారు. ప్రజా ఉద్యమాలు వేరు, రాజకీయాలు వేరని చెప్పిన ప్రొఫెసర్.. ఇప్పుడు రాజకీయ పంథాను ఎంచుకున్నాంమని… సీట్లు గెలిచి అనుకున్న మార్పును సాధిస్తామన్నారు. తప్పదు అనిపించినప్పుడే పోటీ చేస్తా అని చెప్పారు కోదండరాం. రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా కూటమి ఏర్పాటు ఉండాలే తప్ప వ్యక్తులకు మేలు చేకూరేలా ఉండరాదన్నారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి కాబట్టే వేరే పార్టీగా ముందుకు వచ్చామని.. టీడీపీతో జరిగిన గొడవలను మర్చిపోలేదని చెప్పారు.