మహిళా జర్నలిస్టుపై కాల్పులు

మహిళా జర్నలిస్టుపై కాల్పులు

ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలోని వసుంధరా ఎంక్లేవ్ ప్రాంతంలో ఒక మహిళా జర్నలిస్ట్ మిథాలీ చందోలాపై ముసుగులు ధరించిన కొందరు దుండగులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన సమయంలో ఆమె తన కారులో ప్రయాణిస్తున్నారు. కాల్పుల్లో ఆమెకు తూటాలు తగిలి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అందిన సమాచారం మేరకు మిథాలీ నోయిడాలో నివసిస్తున్నారు. గత రాత్రి 12.30 గంటలకు ఆమె తన హ్యుండై ఐ20 కారులో ప్రయాణిస్తుండగా మారుతి స్విఫ్ట్ కారులో వచ్చిన కొందరు దుండగులు ఓవర్ టేక్ చేసి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. వాటిలో ఒక తూటా ఆమె చేతికి తగిలింది. పారిపోవడానికి ముందు వాళ్లు తన కారుపై కోడిగుడ్లు విసిరేశారని బాధితురాలు పోలీసులకు తెలిపారు.

ప్రస్తుతం మిథాలీ ధర్మశిల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కొన్నాళ్లుగా బైకులపై వెళ్లేవారిపై కోడిగుడ్లు విసిరి దోచుకొనేవారే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాన్ని పోలీసులు కొట్టివేయడం లేదు. ఎందుకంటే మిథాలీ తన కుటుంబంతో సత్సంబంధాలు లేవని చెప్పారు.

2008లో మహిళా జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ ని ఇలాగే రాత్రి ప్రయాణిస్తుండగా దారి కాసి కాల్చి చంపారు.