”రాష్ట్రాన్ని పాలిస్తున్నది చినజీయర్‌” – కంచె ఐలయ్య

Hyderabad:

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిపై ప్రొఫెసర్ కంచె ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ‘అంబేద్కర్‌ విగ్రహం ప్రతిష్టించి, దోషులను శిక్షించడం’ అనే సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రాన్ని చినజీయర్ పరిపాలిస్తున్నారని ఆరోపించారు. దళితులు, బీసీల పక్షపాతి అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌ ఇంతవరకు ఏ అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించలేదని విమర్శించారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చినచోటే తిరిగి ప్రతిష్టించాలని ఐలయ్య డిమాండ్‌ చేశారు. విగ్రహం కూల్చివేసి రోజులు గడుస్తున్నా కేసీఆర్‌ స్పందించలేదన్నారు. అంబేద్కర్‌తో పెట్టుకున్న వాళ్లు ఎవరూ బాగుపడలేదన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. అన్ని రకాల పీడనాలకు, ఆర్థిక దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడాలని, అప్పుడే తెలంగాణలో కుల వివక్ష పోతుందన్నారు. కేసీఆర్ కావాలనే దళితులు, కమ్యూనిస్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.